కొంచెం ఓపిక పడితే .. అమరావతి రైతులకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ ఊరట..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఒకరోజు పర్యటన కోసం వచ్చిన ఎన్వీ రమణను గన్నవరం ఎయిర్ పోర్టులో రాజధాని రైతులు కలిశారు. ఈ ఐదేళ్లలో తాము ఎదుర్కొన్న సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన రమణ.. వారికి అంతా మంచే జరగబోతోందని భరోసా ఇచ్చారు. దీంతో అమరావతి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తమను నిండా ముంచిందని, తమ ఫ్లాట్లు అభివృద్ధి చేయలేదని, వాటిని అమ్ముకునేందుకు, తాకట్టు పెట్టుకునేందుకు కూడా లేకుండా పోయిందని, తమపై వందలాదిగా కేసులు నమోదు చేశారని, వీటి విషయంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని అమరావతి రైతులు మాజీ సీజేఐ ఎన్వీ రమణ దృష్టికి తెచ్చారు. దీనికి స్పందనగా ఆయన.. తన కూతుర్లపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలో తాజా పరిణామాలను ఎన్వీ రమణకు వివరించిన రైతులు .. ఎన్నికలయ్యాక తమ గ్రామాలకు రావాలని కోరగా.. ఆయన అంగీకరించారు. అలాగే తమ పోరాటం కొనసాగించాలని ఆయన సూచించారు. ధైర్యంగా ఉంటూ ఏ ప్రభుత్వం ఉన్నా తమ పోరాటం కొనసాగించాలన్నారు. లేకపోతే రైతుల్ని ఎవరూ లెక్క చేయరన్నారు. ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావిస్తూ.. అమరావతి రైతులు అంతకంటే గొప్పగా పోరాటం చేశారని ప్రశంసించారు.
అమరావతి రైతులు కొంచె ఓపిక పట్టాలని, త్వరలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎన్వీ రమణ వారికి తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం భూమిలిచ్చి.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో 1500 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరికి మేలు చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. న్యాయ వ్యవస్ధ కూడా వీరికి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆలస్యమైనా తప్పక న్యాయం జరుగుతుందని, మంచి రాజధాని నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications