రెడ్ బుక్ మీద పడ్డారేంటీ
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమ నిర్మాణాలని భావించిన ఇళ్లనూ కూల్చివేయడానికి వెనుకాడట్లేదు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తోన్నప్పటికీ.. ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ పట్టించుకోవట్లదనే ఆరోపణలు తెలుగుదేశం సంకీర్ణ కూటమిపై ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు సాగుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూనే వస్తోంది.

ఈ నెలన్నర రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న దాడులు, కూల్చివేతలపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలనే భావిస్తోంది వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం. చివరికి తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోన్నారనే ఉద్దేశంతో విశాఖపట్నంలో గల దక్కన్ క్రానికల్ కార్యాలయంపైనా దాడులు చేయడాన్ని గుర్తు చేస్తోంది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా కిషోర్‌రెడ్డి అనుచరుడు శ్రీనును టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను అఖిలప్రియ ఇంట్లో బంధించి చితకబాదారంటూ వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే అనుచరుల నుండి తాను తప్పించుకున్నానన్నంటూ ఎద్దుల శ్రీకాంత్ వెల్లడించారు.
చంద్రబాబు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కు చెందిన ఆసుపత్రిని సైతం తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వంసం చేశారనే ప్రచారం జరుగుతోంది. కుప్పం టౌన్‌లో గల ప్రియ నర్సింగ్ హోంపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారని అంటున్నారు.
టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంటోన్న ఈ పరిణామాలపై తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయడాన్ని వదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్..ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
మేనిఫెస్టో కంటే కేవలం రెడ్ బుక్‌ను అమలు చేయడంపైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారని అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సింది రెడ్ బుక్‌ను కాదని, మేనిఫెస్టోను అమలు చేయండి.. అని గుర్తు చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications