జనసేనలోకి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, కీలక కమిటీలో చోటు
Recommended Video

అమరావతి: మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు ముత్తా శశిధర్ శనివారం జనసేనలో చేరారు. వారితో పాటు దాదాపు 500 మంది అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, టీడీపీ కార్పొరేటర్ మాకినీడు శేషుకుమారి తదితరులు కూడా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.

పార్టీకి యువశక్తితో పాటు అనుభవజ్ఞులు చాలా అవసరమని, రాజకీయాల్లో సంపూర్ణ అవగాహన ఉన్న ముత్తాలాంటి వారు జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసిన ఆయన అనుభవం పార్టీకి, సమాజానికి మంచి చేయాలని పరితపించే జనసైనికులకు దిశానిర్దేశం చేస్తుందన్నారు.
అందుకే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆయనకు స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు. గోదావరి బేసిన్‌లో ఉన్న గ్యాస్ నిక్షేపాలు రాష్ట్రానికి ఉపయోగపడకుండా తరలిపోతున్నాయన్నారు.
వాటిని ప్రశ్నించే వారే లేరని, ముత్తా వంటి పెద్దలు ఆ రోజు విధాన నిర్ణయంలో ఉండి ఉంటే రాష్ట్రానికి ఎంతో కొంత వాటా తీసుకువచ్చేవారన్నారు. పార్టీ పాలసీల్లో వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications