మాజీమంత్రి రోజా షాకింగ్ కామెంట్స్
మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జైలులో ఉన్న వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులను, అన్నాబత్తిన శివకుమార్, అంబటి మురళి తదితరులను పరామర్శించిన మాజీ మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏపీలో కూటమి పాలనపై మాజీ మంత్రి రోజా విమర్శలు
ఏపీలో సాగుతున్న కూటమి పాలన అరాచకమని పేర్కొన్న రోజా, పిన్నెల్లి సోదరులను అక్రమంగా జైల్లో పెట్టారని ఆమె విమర్శించారు. టీడీపీ వ్యక్తులు తమలో తామే చంపుకున్నారని ఎస్పీ చెప్పారని రోజా గుర్తు చేశారు, మళ్ళీ అక్రమకేసులతో వైసీపీ నాయకులను జైలు పాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. పోలీసులు ఖాకీ చొక్కాను, పసుపు చొక్కాగా మార్చేస్తున్నారని, టీడీపీ చెప్పిందే చేస్తున్నారని రోజా మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చాక గుణపాఠం చెప్తాం
వైసీపీ హయాంలో తప్పుడు కేసులు పెట్టలేదని, ఎవరినీ వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్న రోజా, అధికారంలోకి మళ్ళీ వచ్చి తగిన గుణపాఠం చెప్తామని ప్రస్తుతం టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కొందరు నేతలకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయిందన్నారు. మహిళలపై దాడులు, హత్యారాజకీయాలు పెరిగాయని రోజా విమర్శించారు.
సంపద సృష్టి పేరుతో రూ.3 లక్షల కోట్లు అప్పులు
నచ్చని వారిపై తప్పుడు కేసులు మోపడం కూటమికి పరిపాటిగా మారిందని రోజా టార్గెట్ చేశారు.పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర పరువును గంగపాలు చేసి, సంపద సృష్టి పేరుతో రూ.3లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని రోజా విమర్శించారు. రాయలసీమకు న్యాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని,కానీ సీఎం చంద్రబాబు రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని రోజా మండిపడ్డారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చంద్రబాబును టార్గెట్ చేసిన రోజా
రాయలసీమ కరువు పరిష్కార లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ చంద్రబాబు దీనిపై ఏమీ మాట్లాడటం లేదన్నారు.హైదరాబాదులోని తన ఆస్తుల రక్షణ కోసమే చంద్రబాబు ఈ ఘోరానికి ఒడిగట్టారని రోజా వ్యాఖ్యానించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనంపై రోజా ప్రశ్నించారు.
పవన్ చంద్రబాబుకు ఇలానే కత్తి అందిస్తారా?
పవన్ చంద్రబాబుకు మరో పదిహేనేళ్లు కత్తి అందిస్తారా అంటూ మాజీ మంత్రి రోజా నిలదీశారు. బోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీలో కూటమి ప్రమేయం ఉందని రోజా ఆరోపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మైకుల ముందు హీరో, చేసేది జీరో అని విమర్శించారు.












Click it and Unblock the Notifications