వర్ల రామయ్య ఇంటికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్..!!
విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి..వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నివాసానికి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో పర్యటించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగరంలోని విద్యాధర పురంలో నివాసం ఉంటున్న టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికి వెల్లంపల్లి వెళ్లి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందుతున్న సాయానికి సంబంధించిన లేఖ ఇచ్చే ప్రయత్నం చేసారు.
ఆ సమయంలో వర్ల రామయ్య తన నివాసంలోనే ఉన్నారు. వెల్లంపల్లి తన ఇంటికి వచ్చినా, వర్ల రామయ్య బయటకు రాలేదు. తమ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కింద వర్ల రామయ్య సతీమణికి రూ 13,500 సాయం అందిందని వెల్లంపల్లి లేఖ అందించే ప్రయత్నం చేసారు. వర్ల రామయ్య బయటకు రాకపోవటంతో, ఆయన డ్రైవర్ కు వెల్లంపల్లి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం వివరాలతో ఉన్న లేఖను అందించారు. ప్రభుత్వం పైన నిత్యం విమర్శలు చేసే వర్ల రామయ్య కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నామని, ఎటువంటి అవినీతి ..వివక్ష కు తావు లేకుండా సంక్షేమం వైసీపీ ప్రభుత్వ హాయంలో కొనసాగుతోందని మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.

విజయవాడలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయవాడ పశ్చిమంతో పాటుగా సెంట్రల్ నియోకవర్గాలను గెలుచుకుంది. విజయవాడ తూర్పులో టీడీపీ నేత గద్దే రామ్మోహన్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ కొత్త సమీకరణాలకు అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇదే జిల్లాల్లో పూర్వవైభవం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా అటు టీడీపీలో..ఇటు వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications