ముసుగులు వేసుకుని వచ్చి మావాళ్లను చితకబాదుతున్నారు సార్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారని, ఎక్కడపడితే అక్కడ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, ముఖాలు కనపడకుండా టీడీపీ నాయకులు ముసుగులు వేసుకుని వచ్చి చితకబాదుతున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని, ఇప్పటికే చంద్రగిరి నియోజక వర్గంలో 35 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగాయని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. చంద్రగిరి నియోజక వర్గం చాలా ప్రశాంతమైన నియోజక వర్గం అని, అలాంటి నియోజక వర్గంలోని ప్రజలు నేడు భయపడి తిరగాల్సిన పరిస్థితి ఎదురైయ్యిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేశారు.

తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం మీద, చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా ఐదు ఏళ్ల వైసీపీ ప్రభుత్వ్ంలో మేమే ఏ రోజు కూడా పులివర్తి నాని మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని, అదే పులివర్తి నాని ఎమ్మెల్యే అయిన 50 రోజుల్లో మా మీద కక్షసాధించడం మొదలుపెట్టారని వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
మేము అధికారంలో ఉన్న సమయంలో పులివర్తి నాని ఆయన సొంత క్వారీల మీద విజిలెన్స్ అధికారులు దాడులు చెయ్యడానికి సిద్దం అయ్యారని ముందుగానే పసిగట్టి అప్పటి మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దగ్గరకు వెళ్లి సహాయం చెయ్యాలని వేడుకున్నారని, తరువాత తనను సంప్రధించి తనను ఆదుకోవాలని వేడుకున్నాడని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఆ సందర్బంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తాను పులివర్తి నానికి సహాయం చేశామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
పులివర్తి నానికి చెందిన మైనింగ్ లారీలు స్వేచ్చగా తిరగడానికి మేము సహాయం చేశామని, ఆ మైనింగ్ వ్యాపారం అడ్డుకోవడానికి మేము ఏరోజు ప్రయత్నాలు చెయ్యలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. టీడీపీ నాయకుడు పులివర్తి నాని గతంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దగ్గర, తన దగ్గర సహాయం తీసుకోలేదని తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి పాదల దగ్గర ప్రమాణం చెయ్యాలని సవాలు విసిరారు.

పులివర్తి నాని మైనింగ్ కంపెనీకి చెందిన లారీలు తమిళనాడు, కర్ణాటకలో స్వేచ్చగా తిరగడానికి మేము సహాయం చేశామని, ఇంతకాలం మా సహాయం తీసుకుని వ్యాపారం చేసిన ఆయన ఇప్పుడు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రాత్రిపూట ముసుగులు వేసుకుని వచ్చి వారి ముఖాలు కనపడకుండా వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీలో తనపై దాడులు చేశారని పులివర్తి నాని డ్రామాలు ఆడారని, ఆ దాడులకు మాకు ఎలాంటి సంబందం లేదని, ఆయన మనుసులతో ఆయనే దాడులు చేయించుకుని ప్రజల్లో సానుభూతి సంపాధించుకోవడానికి సినిమా ట్రిక్కులు ఉపయోగించారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ కార్యకర్తల మీద ఇలాగే దాడులు చేస్తే తాను రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తానని, ఇకనైనా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ కార్యకర్తలు పద్దతి మార్చుకోవాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని, మకు ఓపిక ఎక్కువ కాలం ఉండదని, పులివర్తి నాని ఇకనైనా కక్షసాధింపు చర్యలు మానుకోవాలని చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications