గుడ్ బై జగన్: మాజీ ఎంపీ
Kesineni Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయవాడ లోక్‌సభ మాజీ సభ్యుడు కేశినేని నాని తీసుకున్న నిర్ణయం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తన రాజకీయ ప్రయాణానికి ఎండ్ కార్డ్ వేశారాయన. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అన్నీ ఆలోచించిన తరువాతే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
మొన్నటి ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కేశినేని నాని. తన తమ్ముడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో ఓటమిపాలయ్యారు. 2.82 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయాన్ని చవి చూశారు. అంతకుముందు రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన విషయం తెలిసిందే.

ఈ ఓటమి తరువాత నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ప్రకటించారు. రెండుసార్లు తనను ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. విజయవాడపై తన నిబద్ధత చెక్కు చెదరబోదని, నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తూనే ఉంటానని అన్నారు.
ఈ నేపథ్యంలో- విజయవాడలో గల కేశినేని భవన్‌పై అమర్చిన వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు. గవర్నర్ పేటలో ఉన్న భవనం ఇది. కేశినేని నాని క్యాంప్ ఆఫీస్‌గా కొనసాగుతోంది. చాలా వరకు ఆయన రాజకీయ కార్యకలాపాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలను ఇక్కడే అధికంగా కలుసుకుంటుంటారు.

గతంలో ఇదే బిల్డింగ్‌పై సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉండేవి. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఆ పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. ఇప్పుడు వాటిని కూడా తొలగించారు. రాజకీయాలకు దూరమైనప్పటికీ- కేశినేని భవన్‌లో ప్రజలకు అందుబాటు నాని ఉంటారని చెబుతున్నారు ఆయన అభిమానులు.












Click it and Unblock the Notifications