విజయవాడ జైలర్ మార్పు వెనుక ప్లాన్ ఇదేనా ? వైసీపీ అనుమానాలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం గేరు మారుస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విపక్ష వైసీపీ నేతల్ని, గతంలో వారి ప్రభుత్వంలో పనిచేసి అధికారుల్ని వరుసగా అరెస్టులు చేస్తోంది. అంతే కాదు వీరందరినీ విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తోంది. అదే సమయంలో తాజాగా విజయవాడ జైలు సూపరింటెండెంట్ ను హఠాత్తుగా మార్చేసింది. దీనిపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జైల్లో ఉన్న వైసీపీ నేతల్ని, అధికారుల్ని వేధించేందుకే ఇలా జైలర్ ను మార్చినట్లు ఆరోపిస్తోంది.
విజయవాడ జైలు అధికారులను హటాత్తుగా మార్చడం వెనుక సీఎం చంద్రబాబు రచించిన మరో భారీ కుట్ర ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయినా వారంతా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారన్నారు. ఒకవైపు సంబంధం లేని అంశాల్లో ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, మరోవైపు అక్రమ అరెస్ట్‌లతో రిమాండ్‌కు పంపి, వారిని జైలులో హింసించాలన్నదే కుతంత్రంగా కనిపిస్తోందన్నారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మార్గాని భరత్ ఆరోపించారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలు లేదని, మరోవైపు ప్రజల దృష్టిని మళ్ళించేందుకు అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ఒక సినీ నటిని తీసుకువచ్చి, తప్పుడు కేసులు నమోదు చేసి, చివరికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమికొట్టారన్నారు.
నేడు గత సీఎం కార్యాలయంలో పనిచేసిన అధికారులనందరినీ టార్గెట్ చేస్తూ, అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదని, గతంలో ఆయన పలుసార్లు అధికారంలో ఉండి, ప్రతిపక్షంలోకి వెళ్ళారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ మళ్లీ అధికారాన్ని చేపడతారని, ఇప్పుడు అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి చంద్రబాబు, పవన్, లోకేష్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టడానికా? అని ప్రశ్నించారు. ఈ తప్పుడు విధానాలుకు పావులుగా వాడుకుంటున్న ఐపీఎస్ అధికారులను తమ దుర్మార్గాలకు బలిపెడుతున్నారన్నారు.

2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ.5000 కోట్ల పైచిలుకు లిక్కర్ స్కామ్ ద్వారా అవినీతికి పాల్పడ్డారని భరత్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బార్ షాప్‌లకు ప్రివిలైజ్డ్ చార్జీలను పెంచుతున్నామని చెప్పి వారి నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకున్నారని, అలాగే తరువాత వారికి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఏడాదికి సుమారు రూ.1300 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 2018-19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.1600 కోట్లు అయితే 2023-24లో లిక్కర్ ఆదాయం రూ.24,700 కోట్లు వచ్చిందని గుర్తుచేశారు. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లుగా వైయస్ఆర్‌సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగిందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications