బూతు నేతలకు పోలింగ్ బూత్ లోనే.. వెంకయ్యనాయుడు పిలుపు..
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరోసారి ప్రజల వద్దకు ఓట్ల కోసం రాజకీయ నేతలు పరుగులు తీస్తున్నారు. ఐదేళ్ల కోసారి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతూ చెలరేగిపోతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ ఓ ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓటర్లకు ఆయన ఎన్నికల వేళ ఓ కీలకమైన పిలుపు ఇచ్చారు.
బూతులు మాట్లాడే రాజకీయ నేతలకు పోలింగ్ బూత్ లోనే బుద్ది చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓ ప్రైవేటు పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య.. తాజా రాజకీయ పరిస్ధితులపై మాట్లాడారు. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్లలో కొంతమంది నేతలు అపహాస్యం చేసే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు.

రాజకీయ నేతలు స్ధాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని, ఇటువంటి వారికి పోలింగ్ బూత్ లో సమాధానం చెప్పాలని ఓటర్లకు సూచించారు. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమన్నారు. మరోవైపు మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని వెంకయ్య కోరారు.
మాతృభాష కళ్ళు లాంటిదని, పరాయి భాష కళ్లద్దాల వంటిదన్నారు. విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారని వెంకయ్య తెలిపారు. ఇవాళ విలువలతో కూడిన విద్య తగ్గుతుందని, ఇది మంచిది కాదన్నారు.
విలువలతో కూడిన విద్య ను అందించడానికి అందరూ కృషి చేయాలన్నారు. దేశంలో ఉన్న మేధాశక్తి వల్ల మరోసారి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందన్నారు. భగవంతుడు తనను ఏం కావాలని అడిగితే మళ్లీ విద్యార్ధి దశకు తీసుకెళ్లమని అడుగుతానని వెంకయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications