మక్కా ప్రమాదం మృతుల్లో నలుగురు ఆంధ్రులు
హైదరాబాద్: మక్కా మసీదులో క్రేన్ కూలి జరిగిన ఘోర ప్రమాదంలో మరణంచిన భారతీయుల సంఖ్య 11కు పెరిగింది. వీరిలో నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇద్దరు కడపకు చెందిన షమీన్ బాను, ఖాదర్ బీ కాగా, మరో ఇద్దరు అబ్దుల్ ఖాదర్ (38), ఫాతిమా ఉన్నీసా (32) దంపతులు. మక్కాలో వీరితోపాటు ఒకే హోటల్లో బస చేసిన విజయవాడ యువకుడి సహాయంతో వీరు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందినవారుగా గుర్తించారు.
రెండు రోజులుగా వీరు హోటల్‌కు రాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించిన ఆ యువకుడు వీరిని గుర్తించాడు. దీంతో అధికారులు ఖాదర్, ఫాతిమాల మృతిని ధ్రువీకరించారు. మచిలీపట్నంలోని ఇంగ్లీషు పాలేనికి చెందిన ఖాదర్ తమ ఇద్దరు పిల్లలను తన తల్లిదండ్రుల వద్ద వదిలి మరో ఏడుగురితో కలిసి ఈ నెల నాలుగో తేదీన భార్యతో సహా హజ్ యాత్రకు పయనమయ్యారు.

విషయం తెలుసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలియజేశారు. హోటల్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో బస చేసి ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి 383 మంది కృష్ణా జిల్లా నుంచి 253 మంది మక్కా యాత్రలో ఉన్నారు.
హైదరాబాద్ నుంచి మక్కాయాత్రలో పాల్గొన్న 5438 మంది సహా మొత్తం 85,909 మంది భారతీయ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు.యాత్రకు వచ్చి ఆచూకీ గల్లంతయినవారి బంధువులు, ప్రైవేట్ టూర్ ఆపరేటర్లతో మాట్లాడిన భారతీయ అధికారులు ఖాదర్, ఫాతిమా కాక మరో 9 మంది భారతీయులు మరణించినట్టు ధ్రువీకరించారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
గాయపడినవారికి భారతీయ అధికారులు క్షేత్రస్థాయిలో సహాయం అందిస్తున్నట్టు వివరించారు. మృతులకు మక్కాలోనే అంతిమ సంస్కారాలు చేసేందుకు వీలుగా వారి కుటుంబాలకు అన్ని విధాలా సహాయం చేస్తామని వెల్లడించారు. జరిగిన ప్రమాదంలో గాయాలపాలైనవారిని సౌదీ రాజు సాల్మన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆస్పత్రిలో పరామర్శించారు.












Click it and Unblock the Notifications