ఏపీలో 4 గ్రామీణ బ్యాంకులు విలీనం.. 5 రోజులు అన్ని సేవలు బంద్ !!
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి.. ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంకుగా మార్చనున్న ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఈ విలీన ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు దేశంలో ఉన్న 43 RRBలు సంఖ్య 28కి తగ్గనుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీలో 4.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో 3.. బీహార్, గుజరాత్, జమ్ము & కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ లలో 2 RRBలు ఏకీకరణ చేసి ఒక్కో గ్రామీణ బ్యాంకుగా మారుస్తున్నారు.
కాగా అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ఇందులో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులను.. కలిపి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు'గా ఏర్పాటు చేయనున్నారు. అయితే నాలుగు బ్యాంకుల డేటాను ఒకే సాంకేతిక ప్లాట్‌ఫామ్‌లోకి మార్చే ప్రక్రియలో భాగంగా.. ఖాతాదారులకు కీలకాక ప్రకటన జారీ చేశారు.

బ్యాంక్ ప్రకటన ప్రకారం.. దాదాపు ఐదు రోజుల పాటు అన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈరోజు ( అక్టోబర్ 9, 2025 ) సాయంత్రం 6 గంటల నుంచి అక్టోబర్ 13 ఉదయం 10 గంటల వరకు అన్ని రకాల బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్ వంటి ఆన్‌లైన్ లావాదేవీలు కూడా పనిచేయవని స్పష్టం చేశారు. ఖాతాదారులు సాధారణంగా ఉపయోగించే ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపారు.
ఈ ప్రక్రియ వల్ల కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఖాతాదారులు ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేయాలని, అవసరమైన నగదు విత్‌డ్రాలు, బిల్లు చెల్లింపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాయంత్రం 6 గంటలలోపే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత నుంచి.. ఖాతాదారులు మరింత సమర్థవంతమైన సేవలను పొందగలుగుతారని చెబుతున్నారు. ఏకైక డేటాబేస్ ద్వారా రియల్‌టైమ్ లావాదేవీలు వేగవంతంగా, భద్రతతో జరగడం, విస్తృతమైన ATM & బ్రాంచ్ నెట్‌వర్క్, మెరుగైన మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications