మీరు అసలు భారతీయులేనా ? దేశబహిష్కరణే..! సాయిరెడ్డి వార్నింగ్..!
ఒకప్పుడు వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగి, గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా రూటు మార్చారు. బీజేపీ దృష్టిలో పడటానికి ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసిన సాయిరెడ్డి.. అవేవీ వర్కవుట్ కావట్లేదని భావించారో ఏమో.. ఏకంగా కాషాయ అజెండానే నెత్తిన వేసుకున్నారు. ఇలా సనాతన ధర్మంతో మొదలుపెట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువు హత్య వరకూ వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా బంగ్లాదేశ్ లో దీపు చంద్ర దాస్ అనే హిందువుపై దైవదూషణ చేశారనే కారణంతో అక్కడి స్థానికులు మూక దాడి చేసి చంపేసి కిరోసిన్ తో తగులబెట్టేసిన ఘటనపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఇప్పటికే ఈ హత్య తర్వాత బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతుండగా.. మన దేశంలోనూ తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా ఈ ఘటనను ఖండించారు. అదే సమయంలో ఈ హత్యపై ఇప్పటిపరకూ స్పందించని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఎక్స్ లో విజయసాయిరెడ్డి ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన బంగ్లాదేశ్ లో మూకదాడి హత్యపై స్పందించని వారిని దేశ బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరికలు కూడా చేశారు. "బంగ్లాదేశ్ లో ప్రస్తుతం హిందువులమీద జరుగుతున్న దాడులను, నరమేధాన్ని ఖండించనివారు అసలు భారతీయులేనా? ఈ దాడులను ఖండించని రాజకీయపార్టీలకు భారతదేశంలో ఉండే నైతిక హక్కు ఉందా? వీటిని ఖండించలేనివాళ్లని మనమే దేశంనుంచి బహిష్కరిస్తాం." అని సాయిరెడ్డి ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాదు దీనికి జాతీయ మీడియాలో ఈ హత్యపై వచ్చిన ఓ వీడియోను కూడా జత చేశారు.












Click it and Unblock the Notifications