గజ్వెల్‌లో కెసిఆర్ రిస్క్: గెలుపు అంత సులభంకాదా?
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గజ్వెల్ అసెంబ్లీ స్థానం నుండి గెలవడం అంత ఈజీ కాదా? అంటే అవుననే అంటున్నారు. ఒకవిధంగా గజ్వెల్ నుండి పోటీ చేస్తున్న కెసిఆర్ సాహసం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గజ్వెల్ నుండి తెరాస తరఫున కెసిఆర్ పోటీ చేస్తుండగా.. బిజెపి మద్దతుతో టిడిపి అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి, కాంగ్రెసు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డి బరిలో ఉన్నారు.
కెసిఆర్ గజ్వెల్ నియోజకవర్గం నుండి తొలిసారి బరిలో నిలుస్తుండటం.. అదీ తెలంగాణ వచ్చాక ఉండటం చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గంలో టిడిపి, కాంగ్రెసు పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఏళ్లుగా ఆ పార్టీల మధ్యనే పోటా పోటీ ఉంది. తెరాస స్థాపించి 13 ఏళ్లు గడుస్తున్నా గజ్వెల్ నియోజకవర్గంలో పట్టు సాధించలేదనే వాదన ఉంది. అయినప్పటికీ కెసిఆర్ గజ్వెల్ నుండి పోటీ చేస్తూ సాహసం చేస్తున్నారని అంటున్నారు.

అయితే, తెలంగాణ అంటే కెసిఆర్.. కెసిఆర్ అంటే తెలంగాణ అని, అలాంటి కెసిఆర్ ఎక్కడి నుండి పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలుస్తారని, ఆయనకు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనేది లేదని తెరాస వర్గాలు చెబుతున్నాయి.
2001లో పార్టీ స్థాపించిన తర్వాత 2004, 2009లలో ఎన్నికలు జరిగాయి. 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెసు అభ్యర్థి, 2009లో పొత్తులో భాగంగా టిడిపి అభ్యర్థి పోటీ చేశారు. ఇతర ఎన్నికలలోను తెరాస ఇక్కడ ముందంజలో నిలిచిన సందర్భాలు తక్కువ.
బలమైన కేడర్ లేని గజ్వెల్ నుండి కెసిఆర్ పోటీ చేయడం రిస్క్ తీసుకోవడమే అంటున్నారు. నర్సారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక టిడిపి అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి స్థానికంగా మంచి పేరు ఉంది. అయితే, కెసిఆర్ గెలుపును ఎవరు ఆపలేరని తెరాస వర్గాలు చెబుతున్నాయి. కెసిఆర్‌ను ఓడిస్తామని కాంగ్రెసు, టిడిపి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కెసిఆర్ తెలంగాణవ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు.. కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వెల్ అసెంబ్లీ, మెదక్ లోకసభ స్థానాల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు.












Click it and Unblock the Notifications