రోజాకు అదేమిటో తెలుసా: గాలి ప్రశ్న, వైఎస్ హామీపై అచ్చెన్నాయుడు నిలదీత
హైదరాబాద్: గ్రోత్ రేట్ల గురించి, నీతి సూత్రాల గురించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాట్లాడడం విచిత్రంగా ఉందని, అసలు ఆ పార్టీ శాసనసభ్యురాలు రోజాకు జిడిపి అంటే తెలుసా అంటూ టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ప్రపంచంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్న దేశాలు ఏవీ లేవని వైసిపి నేతలు అంటున్నారని అది ఆంధ్రప్రదేశ్‌కు ఎలా సాధ్యమని ప్రశ్నించడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు.
అవగాహనా రాహిత్యంతో వైసిపి నేతలు మాట్లాడుతున్నారని, సౌత్ సూడాన్, లియోన్, మంగోలియా, తుర్క్‌మెనిస్తాన్, టర్కీ వంటి దేశాలు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉన్న దేశాలేనని గుర్తించాలని చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని రికార్డు స్థాయిలో ఆస్తులను రెట్టింపుచేసుకోవడం , దొంగలెక్కలు, దొంగ అఫిడవిట్లు చూపించడం, బినామి కంపెనీలను ఏర్పాటు చేయడంలో వైసిపి నేతలు పిహెచ్‌డి చేశారని వ్యాఖ్యానించారు. వారికి అభివృద్ధి గురించి ఏం తెలుస్తుందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న కిలో రూపాయి బియ్యం పథకంపై అబద్దపు ప్రచారాన్ని మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైసిపి నేతలకు హితవు పలికారు. ఏప్రిల్ నుంచి కోటాబియ్యం 4 కేజీల నుంచి 5 కేజీలకు పెంచిన విషయం, కుటుంబానికి 20 కేజీలుగా ఉన్న సీలింగ్‌ను ఎత్తివేసి తెల్లకార్డులో పేరు ఉన్న కుటుంబ సభ్యులందరికి కోటాను విస్తరించిన విషయాన్ని మరచి అవకాశవాద రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
వైఎస్ 9 గంటల విద్యుత్‌పై సంతకం చేసి ఆ హామీని అమలు చేయని సంగతి వైసిపి నేతలు మరచిపోయినట్లు ఉన్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతోందని అన్నారు. చంద్రబాబు తన పాలనలో 9 డిఎస్సీలు నిర్వహించి 1.70 లక్షల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆ విషయాలను మరచిపోయి చౌకబారు విమర్శలు చేయడం వైసిపి నేత పార్థసారథి మానుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications