రాజకీయాలకు ''గల్లా'' కుటుంబం గుడ్‌బై?
గల్లా రామచంద్రనాయుడు.. అమరరాజా పేరుతో కంపెనీ స్థాపించి స్థానికులకు వేలసంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిన పారిశ్రామికవేత్త. ఆయన సతీమణి గల్లా అరుణకుమారి తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి కుమారుడు గల్లా జయదేవ్ 2014, 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రాజకీయంగా మొదటి నుంచి ఘన చరిత్ర ఉన్న ఈ కుటుంబం రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలిసింది.

వ్యాపారాలపై ప్రభుత్వ గురి
పారిశ్రామికవేత్తగా తమకున్న వ్యాపారాలన్నింటిపై ప్రభుత్వాలు గురిపెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న గల్లా అరుణకుమారి రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించారు. మొదటి నుంచి తమకు అండగా ఉన్న అనుచరులంతా తమకు ఇష్టం వచ్చిన పార్టీలో చేరవచ్చన్నారు. అరుణకుమారి ప్రకటనను బట్టి రాబోయే ఎన్నికల్లో గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా పోటీచేయడం కూడా కష్టమనే ప్రచారం నడుస్తోంది.
అరుదుగా గుంటూరు వస్తున్న జయదేవ్
అందుకు తగ్గట్లుగానే జయదేవ్ గుంటూరులో ఏ కార్యక్రమాలకు హాజరుకావడంలేదు. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. అరుదుగా మాత్రమే ఆయన గుంటూరు వచ్చివెళుతున్నారు. ఒకరకంగా గుంటూరులో ఆయన కార్యాలయం తెలియనివారే ఎక్కువ. 2014లో చంద్రగిరి నుంచి పోటీచేసిన అరుణకుమారి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా కూడా రాజీనామా చేశారు.

స్పష్టం చేసిన అరుణకుమారి
రాజకీయ ప్రయాణం ముగించి సేవా ప్రయాణం మొదలుపెట్టబోతున్నామని అరుణకుమారి తెలిపారు. గల్లా జయదేవ్ కొన్నాళ్ల క్రితం వరకు రాజధాని నిరసన కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. క్రమేణా ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. తమకు పునాదిగా ఉన్న వ్యాపార కార్యకలాపాలపై రాజకీయం పంజా విసరడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో జయదేవ్ చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఉంది. అయితే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications