విశాఖలో గంజాయి, బీహార్ లో రివాల్వర్, విజయవాడలో ఇలా చిక్కి !!
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖను కేంద్రంగా చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి వ్యాపారం చేస్తున్న నిందితులు విజయవాడ పోలీసులకు చిక్కిపోయారు. బరితెగించి తుపాకి దగ్గర పెట్టుకొని అడ్డువచ్చిన వారిని బెదిరించి గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన దినేష్ కుమార్, అతని స్నేహితుడు ముత్తును అరెస్టు చేసి కారు, తుపాకీ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ మహేశ్వరరావు మీడియాకు చెప్పారు.
నిందితుడు దినేష్ కుమార్ బీహార్ లో రూ. 75 వేల రూపాయలకు తుపాకి కొనుగోలు చేశాడని, గంజాయి రవాణా చేసే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని బెదిరించడానికి ఈ తుపాకీ ఉపయోగిస్తున్నాడని డీసీపీ ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉమామహేశ్వరరావు విజయవాడలో మీడియాకు వివరాలు చెప్పారు. గతంలో మధ్యవర్తి ద్వారా చెన్నైకి చెందిన దినేష్ కుమార్ గంజాయి కొనుగోలు చేసేవాడని అన్నారు.

ఆ తర్వాత చెన్నైలోని అనేక ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేసేవాడని అన్నారు. విశాఖ ఏజెన్సీలో తానే స్వయంగా గంజాయి కొనుగోలు చేస్తే ఎక్కువ డబ్బు తనకే వస్తుందని, మధ్యవర్తికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదనని దినేష్ కుమార్ ఆశపడ్డాడు. విశాఖ ఏజెన్సీ నుండి చెన్నైకి గంజాయి సరఫరా చేయడానికి దినేష్ కుమార్ సొంతంగా కొత్త కారు కొనుగోలు చేశాడు. విశాఖ ఏజెన్సీకి వెళ్తున్న దినేష్ కుమార్ గంజాయి కొనుగోలు చేసి దానిని చెన్నైకి తీసుకెళ్లి విక్రయిస్తున్నాడు.
కొంతకాలంగా దినేష్ కుమార్ విశాఖ ఏజెన్సీ నుండి చెన్నైకి గంజాయి సరఫరా చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. విశాఖపట్నం నుండి గంజాయి తరలిస్తున్నారని విజయవాడలోని పటమట పోలీసులకు సమాచారం అందింది. విజయవాడలోని రామవరప్పాడు రింగ్ రోడ్ లో పోలీసులు సోదాలు చేశారు. అదే సమయంలో దినేష్ కుమార్, ముత్తు కుమార్ 140 కేజీల గంజాయి తీసుకొని చెన్నై వెళ్లడానికి ప్రయత్నించారు. దినేష్ కుమార్ కారును అడ్డుకున్న పోలీసులు ఆ వాహనం పరిశీలించారు. కారులో 10 లక్షల రూపాయల విలువైన గంజాయి బయటపడటంతో దినేష్ కుమార్, ముత్తును అరెస్ట్ చేసి కారు, గంజాయి, తుపాకి స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో నిందితులకు సహకరించిన గంజాయి వ్యాపారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications