గన్నవరంలో లెక్క మారబోతోందా ? యార్లగడ్డ-వంశీ పోరులో తాజా ట్విస్ట్ లు..!
గన్నవరం (Gannavaram) నియోజకవర్గంలో గత రెండు ఎన్నికలుగా వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatrao) మధ్య పొలిటికల్ వార్ నడుస్తూనే ఉంది. 2019 ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన వల్లభనేని వంశీ చేతిలో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయారు. దీంతో జగన్ ఓడిపోయిన యార్లగడ్డను కాదని, వంశీని పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో చేసేది లేక టీడీపీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుని యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో గెలిచారు. దీంతో ఈ వార్ మరింత ముదిరింది.
అయితే రెండేళ్లుగా వంశీపై పలు కేసులు పెట్టేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయిన యార్లగడ్డ వెంకట్రావుకు ఈ మధ్య గన్నవరం ఎయిర్ పోర్టు టెర్మినల్ కాంట్రాక్టు రూపంలో భారీ షాక్ తగిలింది. ఒకప్పుడు చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీకి అనుచరుడిగా ఉన్న కేఎంవీ ప్రాజెక్ట్స్ యజమానికి కూటమి సర్కార్ ఎయిర్ పోర్టు కాంట్రాక్టు కట్టబెట్టడం యార్లగడ్డ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి కూటమి పెద్దలపై మండిపడ్డారు. అంతే కాదు త్వరలో కార్యకర్తలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానన్నారు.

అనంతరం వల్లభనేని వంశీ యార్లగడ్డ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు కానీ యార్లగడ్డ కానీ స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారంలో చంద్రబాబు, వంశీ కలిసి తనను ఇరుకునపెట్టబోతున్నారా అన్న అనుమానాలు యార్లగడ్డకు మొదలయ్యాయి. అదే సమయంలో చంద్రబాబు తీరుపై గుర్రుగా ఉన్న యార్లగడ్డ తిరిగి తన పాత పార్టీ వైఎస్సార్సీపీలోకి వెళ్లి వంశీని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతోంది. విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తానంటే వైసీపీలోకి తిరిగి వెళ్లేందుకు యార్లగడ్డ సిద్దంగా ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. దీంతో యార్లగడ్డ పెట్టే కార్యకర్తల భేటీ, వంశీ లేఖపై చంద్రబాబు స్పందన కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications