విశాఖకు గంటా శ్రీనివాస్ గుడ్‌బై?
Ganta Srinivas: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్.. విశాఖపట్నం జిల్లా రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతోన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ జిల్లా నుంచి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ సారి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది. పొరుగునే ఉన్న విజయనగరం జిల్లాకు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి నుంచి ఆయనకు సమాచారం సైతం అందిందని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తారని సమాచారం. ఈ నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం ఇదే. ఆయనకు చెక్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ.. గంటా శ్రీనివాస్‌ను రంగంలోకి దింపుతుందని చెబుతున్నారు.
ఒకప్పుడు చీపురుపల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి 1999 వరకు టీడీపీకి తిరుగే లేదిక్కడ. 2004లో తొలిసారిగా ఓటమి చవి చూసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2009లోనూ ఆయనదే విజయం. 2014లో టీడీపీ మళ్లీ గెలిచింది గానీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 2019లో మళ్లీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు బొత్స.
ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ప్రభావం లేకుండా చేయడం.. తన కంచుకోటను మళ్లీ దక్కించుకునేలా స్కెచ్ వేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగా- ఇక్కడి నుంచి గంటా శ్రీనివాస్‌ను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ దిశగా టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మతో మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. మరోసారి సర్వే నిర్వహించి గంటా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయొచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications