గరుడ వాహనారూఢుడై ఊరేగిన దేవదేవుడు: ముందే వచ్చిన బ్రహ్మోత్సవ గరుడ సేవ
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా భక్తుల రద్దీని తట్టుకోవడానికి, భద్రతా వ్యవస్థను పటిష్టతను పరీక్షించడానికి శుక్రవారం రాత్రి పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీవారి గరుడ సేవ ట్రయల్ రన్ ను నిర్వహించింది. రాబోయే బ్రహ్మోత్సవాల నాటి గరుడ సేవకు దీన్నొక రిహార్సల్‌గా తీసుకుంది.
సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎదురయ్యే సవాళ్లను గుర్తించి సమర్థవంతంగా పరిష్కరించడం టీటీడీకి ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్యూహాత్మక సన్నద్ధతలో భాగంగానే అత్యంత ప్రాముఖ్యత కలిగిన గరుడ వాహన సేవ ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రతి పౌర్ణమికీ నిర్వహించే శ్రీవారి గరుడ సేవ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ ట్రయల్ రన్ చేపట్టింది. సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఈ వాహన సేవ సాగింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు భక్తుల రద్దీ నియంత్రణకు సంబంధించిన అంశాలపై వారు ప్రత్యేక దృష్టి సారించారు. క్యూలైన్లు గ్యాలరీల్లో తాగునీటి సరఫరా, అన్నప్రసాద వితరణ కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలో చర్చించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి తరలిరానున్నందున తోపులాటకు తావివ్వకుండా ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల భద్రత గురించి ఆరా తీశారు. అవసరమైన చోట అదనపు బారికేడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేశారు. గరుడ సేవ రోజున భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండటానికి కు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు.
గరుడ సేవ ట్రయల్ రన్ సందర్భంగా నాలుగు మాడ వీధులు క్రిక్కిరిసిపోయాయి. మంగళవాయిద్యాల కోలాహలం మధ్య, శ్రీవారి గరుడ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడిచొచ్చాయి. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హారుతుల పట్టారు. పౌర్ణమి వెలుగుల్లో తిరుమల కొండపై ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.















Click it and Unblock the Notifications