మెడిసిన్స్ ధరలపై సుప్రీం సంచలన ప్రశ్న.. ఆ మార్జిన్ అందరికీ ఎందుకు వర్తించదు?
ప్రాణాలను కాపాడే మెడికల్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ ధరలు సామాన్యుడికి మోయరాని భారంగా మారుతున్నాయి. ఇదే అంశంపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించింది. దేశంలోని అన్ని రకాల మందులపై ఒకే రకమైన రిటైలర్ మార్జిన్‌ను ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు సూటిగా నిలదీసింది. ఔషధ ధరల నియంత్రణ విధానంలో భాగంగా కొన్ని మందులకు ఇస్తున్న 16 శాతం మార్జిన్‌ను.. అన్ని రకాల నిత్యావసర, నాన్-ఇన్సెన్షియల్, పేటెంట్- జెనరిక్ మందులన్నింటికీ ఎందుకు వర్తింపజేయలేరని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
రూ.2,700 మందు.. రూ.27,000 ధర!
మందుల తయారీదారులకు, సామాన్యులకు విక్రయించే ఎంఆర్పీ మధ్య ఉండే భారీ వ్యత్యాసాన్ని గత వార విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఒక క్యాన్సర్ మందు రిటైలర్లకు కేవలం రూ.2,700కే అందజేయబడుతుండగా, అదే మందును పేషెంట్లకు మాత్రం రూ.27,000 ఎమ్‌ఆర్‌పికి అమ్ముతున్న వైనాన్ని న్యాయస్థానం ఉదాహరణగా పేర్కొంది. దేశంలోని సుమారు 82 శాతం మందులు ధరల నియంత్రణ ఉత్తర్వుల పరిధిలోకి రాకుండా స్వేచ్ఛగా అమ్ముడవుతున్నాయని పిటిషనర్ కిషన్ చంద్ జైన్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భారీ వ్యత్యాసంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

ఆసుపత్రుల దోపిడీపై నిలదీత
ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఫార్మసీల ద్వారానే రోగులు మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయాలంటూ బలవంతం చేయడంపై కూడా సుప్రీంకోర్టు మండిపడింది. ఆసుపత్రుల లోపల ఉండే ఫార్మసీలు చెప్పినంత ధర చెల్లించి మందులు కొనాల్సి వస్తోందని, అసలు రోగులకు బయట కొనుగోలు చేసే స్వేచ్ఛ ఎక్కడ ఉందని కోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రులు వసూలు చేస్తున్న గరిష్ట ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రోగుల బలహీనతను ఆసరా చేసుకుని ఆసుపత్రులు చేస్తున్న ఈ వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది.
సరఫరా వ్యవస్థపై కంపెనీల వాదనలు
ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ మాట్లాడుతూ.. పేదలకు సరసమైన ధరలకే మందులు అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, మెరుగైన విధానాల రూపకల్పనకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. మరోవైపు, ఫార్మా కంపెనీల తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ.. రిటైలర్ ధరలకు, ఎంఆర్‌పీకి మధ్య కనిపించే భారీ లాభం పూర్తిగా ఫార్మా కంపెనీల వద్దే ఉండిపోదని, సరఫరా గొలుసులోనివివిధ దశలను పరిశీలించాలని కోర్టును కోరారు.
తదుపరి విచారణ అక్టోబర్ 12కి వాయిదా
ప్రస్తుతానికి మందుల ధరల నియంత్రణపై సుప్రీంకోర్టు ఎలాంటి తుది ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ, న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెడికల్ పరికరాలు, మందుల ధరలు మరియు జెనరిక్ మందుల విధివిధానాలపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోపు ఈ అంశంపై సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు భావిస్తోంది.














Click it and Unblock the Notifications
