గ్యాస్ లీక్..: దుర్గ గుడి వంట గదిలో.. తప్పిన పెను ప్రమాదం
విజయవాడ: విజయవాడ శ్రీకనక దుర్గ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానానికి చెందిన వంటగదిలో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. విజయవాడ అర్జున వీధిలోని వంటగదిలో ప్రసాదాన్ని తయారు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకైంది. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. గ్యాస్ ను సరఫరా చేస్తోన్న పైపుల వాల్వులను కట్టేశారు. ఫలితంగా పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీని అరికట్టే పనిలో నిమగ్నమయ్యారు.
శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆదివారం ఆరంభమైన విషయం తెలిసిందే. దసరా పండుగ ఉత్సవాల ప్రారంభమైన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో.. అర్జున వీధిలోని వంటగదిలో 24 గంటలుగా ప్రసాదం తయారీ కొనసాగుతోంది. ప్రసాద రూపంలో పులిహోరను సిద్ధం చేయడానికి 50 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం యధాతథంగా పులిహోరను తయారు చేస్తోన్న సమయంలో అకస్మాత్తుగా పైపుల నుంచి గ్యాస్ లీకైంది. ఒకేసారి 40 సిలిండర్లకు గ్యాస్ ను సరఫరా చేసే పైపులు అవి.

పైపులకు అమర్చిన వాల్వ్ ల వద్ద చిన్నపాటి చీలక నుంచి గ్యాస్ పైకి ఎగదన్నింది. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. గ్యాస్ ను సరఫరా చేసే ప్రధాన వాల్వ్ ను మూసివేశారు. ఫలితంగా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారాన్ని దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం అధికారులకు చేర వేశారు. సమాచారం అందుకున్న వెంటనే దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఇంజినీరింగ్ ఉద్యోగులు వంటగదికి చేరుకున్నారు. వాల్వ్ లను మరమ్మతు చేస్తున్నారు. కొన్ని పైపులను మార్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications