చక్రం తిప్పిన లోకేశ్: జగన్‌కు మరో షాక్, టీడీపీ గూటికి గిద్దలూరు ఎమ్మెల్యే?
విజయవాడ: ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' ఇప్పుడే ముగిసేలా లేదు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో అశోక్ రెడ్డి ఇప్పటికే భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, అధికారికంగా ఆ వార్త ఎక్కడా బయటకు రాలేదు. ఇదే విషయం గిద్దలూరు టీడీపీ నేతలకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగిన పార్టీ నియోజకవర్గ నేతలు... ఆదివారం నేరుగా హైదరాబాదు వచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యేందుకు యత్నించారు.
అయితే లోకేశ్ హైదరాబాదులో లేరని, విజయవాడలో ఉన్నారని తెలుసుకుని అక్కడికీ పయనమయ్యారు. రెండు రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు మంగళవారం విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను నియోజకవర్గ నేతలు కలిశారు. అశోక్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని వారు లోకేశ్‌కు విన్నవించారని సమాచారం.

గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా అన్నే రాంబాబు బాగానే పనిచేస్తున్నారని, ఆయన నేతృత్వంలో పార్టీ బాగానే బలపడిందని, కొత్తగా అశోక్ రెడ్డి పార్టీలోకి రావడంతో ఒరిగేదేమీ లేదని నేతలు చెప్పారు. నేతలు చెప్పిన విషయాలను సాంతం విన్న నారా లోకేశ్ వారిని అనునయించే ప్రయత్నం చేశారంట.
పార్టీలోకి చేరతామంటూ ఎవరు ముందుకు వచ్చినా కాదనవద్దని వారికి సూచించారు. అయినా పార్టీలో చేరుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు చెందిన నియోకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలతో ముందుగా మాట్లాడిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకుంటున్నాం కదా అని లోకేశ్ వారికి చెప్పారు.
పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా విపక్ష ఎమ్మెల్యేల చేరికను అడ్డుకోవద్దని ఆయన వారిని అనునయించి పంపారు. సొంత పార్టీ నేతలు లోకేశ్‌ను కలవడంతో... అశోక్ రెడ్డి టీడీపీలో చేరుతున్న వైనం బయటకు వచ్చేసింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి త్వరలో ఓ స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ భాగంగా వైపీసీ టికెట్‌పై విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పలు దఫాలుగా జరిగిన ఈ చేరికల్లో వైసీపీలో కీలక నేతలుగా ఎదిగిన భూమా నాగిరెడ్ది, జ్యోతుల నెహ్రూ తదితరులు ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications