వాలంటీర్లకు కోత పెట్టిన ఏపీ సర్కార్: తక్షణ ఉత్తర్వులు జారీ
AP Volunteers: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ పదేపదే హామీలను ఇచ్చిన కూటమి- ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది.
లబ్దిదారులకు ప్రతి నెలా ఇంటి వద్దే పింఛన్ మొత్తాన్ని చెల్లించే విధానం నుంచి వలంటీర్లను దాదాపుగా తప్పించింది. ఈ బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. జులై 1వ తేదీ నుంచే ఈ మార్పు అమలులోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది.

అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింద చంద్రబాబు సర్కార్. ప్రతి నెలా వారికి చెల్లించే 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్‌ను రద్దు చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంది కూడా. జులై 1వ తేదీన వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం ఉండదు.
వాలంటీలర్లకు చెల్లించే గౌరవ వేతనంలో 200 రూపాయల న్యూస్ పేపర్ అలవెన్స్‌ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదల అయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ/వార్డు వాలంటీర్లు, సచివాలయాల విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతన మొత్తంలో నుంచి ఈ 200 రూపాయలను తీసివేయాలని ఆయన సూచించారు.
ఈ పరిణామం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ ఉండబోదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు ఏపీ మొట్టమొదట బలైంది వాలంటీర్లేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications