శ్రీవారి భక్తులకు సువర్ణావకాశం... ఆగస్టు 1న ఆ వస్తువులకు ఈ వేలం...
దేశంలోని ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రం మన ఏపీలో ఉంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శన భాగ్యం పొంది తమ మొక్కులను చెల్లించుకుంటుంటారు. అలాగే, శ్రీవారికి హుండీల్లో కానుకలు కూడా సమర్పిస్తుంటారు. ఇలా తిరుమల స్వామివారికి కొందరు భక్తులు కెమెరాలను కూడా కానుకలు సమర్పించారు. అయితే, ఆ కెమెరాలను ఆగస్టు 1వ తేదిన ఈ వేలం వేయనున్నట్లు తిరుమల అధికారులు తెలిపారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కెమెరాల ఈ వేలానికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ వివరాలేంటో ఇప్పడు చూసేద్దాం..
తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వేలం నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలలో ఒకటైన కెమెరాలను వచ్చే నెల 1వ తేదిన రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కెమెరాల్లో వివిధ కంపెనీలకు సంబంధించిన కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అందులో నైకాన్, కెనాన్, కొడాక్ తదితర కెమెరాలున్నాయి. అందులో వినియోగంలో ఉన్న, కొంతమేరకు దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచినట్లు అధికారులు వివరించారు. భక్తుల ఇతర పూర్తి సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించగలరు. లేదంటే టీటీడీ అధికారికి వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లో వివరాలను చూడగలరని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు కూడా ఈ వెబ్‌సైట్లను సంప్రదించాలని టీటీడీ తెలిపింది.

వైభవంగా పల్లవోత్సం..
తిరుమల ఆలయంలో నిన్న (బుధవారం) ఎంతో వైభవంగా పల్లవోత్సవ కార్యక్రమం జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే నిన్న సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications