నెలాఖరు లోపు జగన్ అరెస్ట్ పక్కా..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు బెయిల్ పైన విడుదల అవుతున్నారు. కొంత కాలంగా లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఖాయమని కూటమి నేతలు చెబుతూ వచ్చారు. అయితే, ఈ కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. కాగా, ఇప్పుడు మరో సారి జగన్ అరెస్ట్ పైన అంచనాలు మొదలయ్యాయి.
లిక్కర్ కేసులో వేల కోట్ల స్కాం జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ చేస్తున్న సిట్ పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది. కాగా.. రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. వీటిల్లో లోపాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన చేసినా.. నిందితుడుగా మాత్రం చేర్చలేదు.

అదే సమయంలో జగన్ అరెస్ట్ గురించి అనేక రకాలుగా ప్రచారం సాగింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తరువాత సాయిరెడ్డి, జగన్ పేర్లు తెర పైకి వచ్చాయి. రాజకీయ కోణంలోనూ జగన్ అరెస్ట్ అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటి వరకు పరామర్శించకపోవటం మరో ఆసక్తి కర చర్చగా మారింది.
ఇక, ఇప్పుడు జగన్ అరెస్ట్ ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే... తెలంగాణ నేత గోనె ప్రకాశ రావు తిరుపతి కేంద్రంగా పేర్కొన్నారు. మద్యం కుంభకోణం జగన్‌రెడ్డి మెడకు చుట్టుకుందని చెప్పుకొచ్చారు. జగన్ సెప్టెంబరు నెలాఖరులోపు అరెస్టవడం పక్కా.. అంటూ గోనె ప్రకాశ రావు చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ప్రచారం సాగుతున్నట్లుగా జగన్ అరెస్టు కోసం బీజేపీ అనుమతితో కూడా అవసరం ఉండదని విశ్లేషించారు.

లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. పక్కా ఆధారాలు ఉండటంతో జగన్ అరెస్ట్ నుంచి తప్పించుకో లేరని వ్యాఖ్యానించారు. అదే విధంగా వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ వందలకోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేసారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాల్సిన జగన్ ఎన్డీఏ వైపు ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications