శ్రీవారి భక్తులకు శుభవార్త: 15 నుంచి ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు, రెండేళ్ల తర్వాత జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా నిలిపి వేసిన ఆఫ్‌లైన్ టికెట్ల జారీని టీటీడీ ఈ నెల 15 నుంచి పునరుద్ధరించనుంది. 16వ తేదీ దర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది.

15 నుంచి టీటీడీ సర్వదర్శనం టికెట్లు ఆఫ్‌లైన్లో..
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది. ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్‌లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది.
ఈ మేరకు రోజుకు 25వేల నుంచి 30 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్‌లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఆఫ్‌లైన్లో రోజుకు 15వేల టికెట్లు.. రెండేళ్ల తర్వాత
రోజుకు 15వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలలో టోకెన్లు జారీ చేయనుంది. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్‍లైన్‌లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసింది.

కరోనా తగ్గుముఖం పట్టడంతో టీటీడీ ఈ నిర్ణయం
గత ఏడాది రోజుకు 2వేల చొప్పున టికెట్లు జారీ చేసినా.. భక్తుల రద్దీ దృష్ట్యా నిలిపేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రమే రోజుకు 5వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కూడా దాదాపు వందశాతం పూర్తవడంతో ఆఫ్‍లైన్ టోకెన్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో పెరగనున్న శ్రీవారి భక్తుల సంఖ్య
ఇక, ఆఫ్‍లైన్‌లో 15వేల టోకెన్లు జారీ చేస్తుండటంతో ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40వేలు దాటే అవకాశముంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఆఫ్‍లైన్‌లో టోకెన్లు తీసుకునేవారు కూడా కరోనా నెగెటివ్ రిపోర్ట్, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా చూపాల్సివుంటుంది. అలాగే క్యూలైన్లలో కరోనా మార్గదర్శకాలను పాటించాల్సివుంటుంది.












Click it and Unblock the Notifications