ఏపీ, తెలంగాణకు అదిరిపోయే శుభవార్త
తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్లు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై పట్టణాల మధ్య ఇవి నడుస్తున్నాయి. ప్రయాణికుల ఆదరణను బట్టి పుణెకు కూడా నడిపే యోచనలో రైల్వేశాఖ ఉంది. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సమయంలోనే డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ యోచిస్తోంది.
పగటివేళే కావడంతో : దేశవ్యాప్తంగా తిరుగుతున్న కొన్ని డబుల్ డెక్కర్ రైళ్లు పగటివేళ మాత్రమే తిరుగుతున్నాయి. సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగంతోనే తిరుగుతున్నప్పటికీ ఇవి కేవలం పగటివేళే పరుగులు తీస్తుండటంతో సమయం వృథా అవుతుందని ప్రయాణికులు భావిస్తున్నారు. దీంతో సహజంగానే వీటికి ఆదరణ తగ్గిపోయింది. పగటి సమయంలో తిరగడంవల్లే ఆక్యుపెన్సీ తగ్గిపోయిందని అధికారులు గుర్తించారు.

అంతంత మాత్రంగానే : డబుల్ డెక్కర్ ను ప్రవేశపెట్టిన సమయంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నంకు తిరిగేవి. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కేవలం పగటి సమయంలో ప్రయాణించడంవల్ల రోజంతా వృథా అవుతోందనే భావనకు వచ్చారు. దీంతో సహజంగానే సాయంత్రం వేళ బయలుదేరే రైళ్లకే మొగ్గుచూపారు. ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో రైల్వేకు వాటిని రద్దుచేయక తప్పింది కాదు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఓ డబుల్ డెక్కర్ (22707) నడుస్తోంది. దీనికి కూడా ప్రయాణికుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది.
అన్నీ కుదిరితే : వందే భారత్ రైళ్ల తరహాలో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ల వేగాన్ని పెంచడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. వాటిల్లో బెర్తులు ఏర్పాటుచేసి రాత్రివేళ తిప్పితే విజయవంతమవుతాయనుకుంటున్నారు. ఈ రైళ్లల్లో పై డెక్ లో ప్రయాణికులు, కింద డెక్ లో సరకులు ఒకేసారి రవాణా చేసేలా రైల్వే బోర్డు యోచన చేస్తోంది. డిజైన్లను ఆర్డీఎస్వో పరిశీలిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డబుల్ డెక్కర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయనున్నాయి.












Click it and Unblock the Notifications