అమెరికా తరువాత విశాఖ కేంద్రంగా, గూగుల్ భారీ పెట్టుబడి- గేమ్ ఛేంజర్..!!
విశాఖ డేటా సెంటర్లకు హబ్ గా మారుతోంది. ఐటీ దిగ్గజ సంస్థ గుగూల్ విశాఖలో భారీ పెట్టుబడితో ముందుకు వస్తోంది. దాదాపు రూ 50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఇది ఆసియాలోనే అతి పెద్ద హైపర్ స్కేల్ డేటా కానుంది. గుగూల్ సంస్థ అమెరికా తరువాత బయట ఏర్పాటు చేసే అతిపెద్ద డేటా కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. దీంతో పాటుగా మరో రెండు సంస్థలు తమ డేటా సెంటర్లు ఏర్పాటుకు విశాఖను ఎంచుకున్నాయి. మొత్తంగా ఈ మూడు సంస్థల ఏర్పాటు విశాఖకు గేమ్ ఛేంజర్ గా మారనుంది.
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ ఆసక్తి గా ఉంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌కు 200 ఎకరాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఇప్పటికే గూగుల్ సంస్థ ప్రతినిధులు భూములు పరిశీలన చేసారు. ఇక, ఇప్పటికే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు దిశగా ముందుకొచ్చింది. ఈ సంస్థ 200 మెగావాట్లతో ఒక డేటా సెంటర్‌ను, 100 మెగావాట్లతో మరో సెంటర్‌ను ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. దీని ద్వారా 1,240 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దీని కోసం ప్రత్యేకంగా ఎస్‌పీవీ ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా రూ.16,466 కోట్లతో సిఫీ టెక్నాలజీస్ ఒప్పందం చేసుకుంది. మొదటి దశలో రూ.1,466 కోట్లు వెచ్చిస్తారు. దీని ద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్ లో దేశానికి చెందిన మొత్తం డేటా నిల్వ చేయనుంది. ముంబయిలో గూగుల్‌కు చెందిన పియరింగ్, క్యాచీ సర్వర్లు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవడం సులువు అవుతుంది. డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్దఎత్తున నీరు అవసరం అవుతుంది. అందుకే డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది.
పైగా ఐటీ రంగంలో రూ.2 కోట్ల పెట్టుబడి పెడితే ఒకరికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఆ లెక్కన గూగుల్ సంస్థ పెట్టే సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడుల ఆధారంగా రాష్ట్రంలోని సుమారు 25 వేల మంది నిరుద్యోగులకు దశలవారీగా ప్రత్యక్ష ఉపాధి అవకాశం లభించనుంది. ఇక పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications