ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు.. ఎక్కడెక్కడంటే ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని కొనసాగిస్తున్న సర్కారు.. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15000 నగదు జమ చేయనుంది. ఇన్నాళ్లు 10వ తరగతి విద్యార్థులకే పరిమితమైన ఈ పథకాన్ని ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా అందించనున్నారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో సైతం మార్పులు తెచ్చారు. విద్యార్థులకు సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాస్మోటిక్ కిట్స్, నైట్ డ్రెస్ లను ప్రభుత్వం అందజేయనుంది. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో రెండు కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలుగు యూనివర్సిటీని రాజమండ్రిలో.. అంబేద్కర్ యూనివర్సిటీని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేయనున్నారు.

అంతే కాకుండా స్టడీ సెంటర్ల బాధ్యతలను బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం అప్పగించింది. శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో ఉన్న మూడు ప్రముఖ పీఠాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురానున్నారు.
ఇప్పటివరకు ఈ రెండు విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండగా.. ఉమ్మడి ఏపీ సమయంలో వాటికి అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా స్టడీ సెంటర్లు ఉండేవి. అయితే ఇటీవల వీటి సేవలు నిలిపివేయడంతో ఇప్పుడు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అనుమతులు రద్దయిన 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అనుమతులను తిరిగి పునరుద్ధరించింది. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో పాలిటెక్నిక్ విద్య కీలకంగా ఉండే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అలానే కొత్తగా ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయాల వలన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్య చేరువ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిధుల విడుదలపై దృష్టి సారిస్తామన్నారు. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications