సవాంగ్ కు లైన్ క్లియర్ - సీఎం అనుకున్న విధంగానే : గవర్నర్ సైతం..!!
డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఈ రోజున తన బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్నారు. సీఎం గా జగన్ బాధ్యలు చేపట్టిన సమయం నుంచి డీజీపీగా కొనసాగిన ఆయన్ను ఏపీ ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డిని డీజీపీగా నియమించింది. అయితే, సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో అనేక విమర్శలు చేసిన ప్రతిపక్ష పార్టీలు..ఇప్పుడు ఆయన బదిలీ పైన రాజకీయంగా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నాయి. సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

అంతా సిద్దం చేసుకున్న తరువాతనే
అయితే, ఆకస్మికంగా సవాంగ్ కు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఉన్న పోస్టును ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్ ..ఆయన్ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ రాజ్యంగబద్దమైన పదవి కావటంతో సవాంగ్ తన ఐపీఎస్ కు స్వచ్చందంగా పదవీ విరమణ చేయాల్సిందేననే వాదన తెర పైకి వచ్చింది. కానీ, ప్రభుత్వం ఈ నిర్ణయానికి ముందే ఏపీపీఎస్సీ రూల్ బుక్..గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీలో ఒక సభ్యుడి నియామకానికి సంబంధించిన జారీ చేసిన జీవోలోని ఒక అంశం ఆధారంగా గౌతమ్ సవాంగ్ నియామకానికి ఫైల్ సిద్దం చేసింది.

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా లైన్ క్లియర్
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతల స్వీకరణకు వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అసవరం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వీస్ కమీషన్ 7(1)(a) ప్రకారం సదరు సభ్యుడు అపాయింట్ అయిన రోజు నుండి ఏపీపీఎస్సీలో సర్వీస్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో రూపొందించిన విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అదే విధంగా 2019 ఏప్రిల్ 12 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒక సభ్యుడి నియామకంలో ఈ ప్రొవిజన్ వినియోగించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
అందులోని 'డీమ్డ్ టు బి రిటైర్డ్' అనే నిబంధనతో ఇప్పుడు గౌతమ్ సవాంగ్ సైతం స్వచ్చంద పదవీ విరమణ అవసరం లేకుండానే..ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం ఫైల్ సిద్దం చేసింది.

సీఎం జగన్ అనుకున్నవిధంగానే
దీంతో..ఆయన సర్వీసు ద్వారా కలగాల్సిన అన్ని ప్రయోజనాలు దక్కుతాయి. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఈ ఫైల్ కు రాత్రి గవర్నర్ ఆమోద ముద్ర లభించినట్లు సమాచారం. దీంతో.. 62 ఏళ్ల వయసు లేదా 6 ఏళ్లు... ఆయన సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవిలో ఉంటారు. అంటే సవాంగ్ మూడున్నారేళ్లు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇక, ఈ రోజున గౌతమ్ సవాంగ్ డీజీపీ బాధ్యతల నుంచి రిలీవ్ అవుతున్నారు. కొత్త డీజీపీగా నియమితులైన కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించనున్నారు.
రేపు (ఆదివారం) ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. దీని ద్వారా సీఎం జగన్ అనుకున్న విధంగానే డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మరో ఉన్నతమైన పదవిలో..కీలక బాధ్యతలు అప్పగించారు.