లిక్కర్ ఔట్ లెట్స్ -మరో ఏడాది దుకాణాలు యథాతధం : ఏపీ కొత్త మద్యం పాలసీ - డిజిటల్ చెల్లింపులు ..!!
ఏపీలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పాలసీలో ఆ దిశగా అడుగులు కనిపించ లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఖరారు చేసిన తొలి పాలసీలో దుకాణాల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం యధాతధంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా వాకిన్ స్టోర్స్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా టూరిజం సెంటర్లలో లిక్కర్ అవుట్ లెట్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

యధాతధంగా మద్యం దుకాణాలు
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ 2022 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు ప్రకటించిన విధంగా దశల వారీగా మద్య నిషేధం అమలుకు ఈ ఏడాది ఎక్కడా చర్యలు కనిపించ లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. మొదటిదశ లాక్‌డౌన్ తర్వాత గతేడాది మే నెలలో అప్పటి వరకు ఉన్న 3,500 మద్యం దుకాణాలను 2,934 కు తగ్గించారు. ఈ సారీ దుకాణాల సంఖ్యను తగ్గించలేదు.

కొత్త ఔట్ లెట్స్ కు అనుమతులు
గత సంవత్సరం నుంచి ఉన్న 2,934 దుకాణాల్నే రాబోయే ఏడాది పాటు కొనసాగించనున్నట్లు పేర్కొంది. గతంలో రెండు పాలసీల్లో ప్రకటించిన విధంగానే మద్యం వాకిన్ స్టోర్స్ కొనసాగిస్తూ ఈ సారి నిర్ణయం తీసుకున్నారు. వీటి ద్వారా రూ.7-8 లక్షల మద్యం విక్రయిస్తున్నారు. వీటిద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తోంది. పెద్దగా వ్యాపారం జరగని, రద్దీ ప్రాంతాల్లో లేని సాధారణ మద్యం దుకాణాల్ని తొలగించి వాటి స్థానంలో రద్దీ, ఖరీదైన ప్రాంతాల్లో వాకిన్ స్టోర్స్ ఏర్పాటుకు వీలుగా వీటిని తెరపైకి తెచ్చారని, అందుకే మద్యం దుకాణాల్ని ఎక్కడికైనా మార్చేందుకు ఏపీఎస్‌బీసీఎల్ ఎండీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డిజిటల్ పేమెంట్స్ ద్వారా మద్యం అమ్మకాలు
రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్‌లెట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థకు అనుమతిచ్చింది. బెవరేజెస్ కార్పొరేషన్‌తో సమన్వయంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలని నూతన విధానంలో పేర్కొంది. ఇప్పటికే కొన్ని పర్యాటక కేంద్రాల్లో వీటిని ఏర్పాటుచేశారు. 2,934 మద్యం దుకాణాలకు ఇవి అదనంగా ఉండనున్నాయి. ఇప్పటి వరకు ప్రస్తుతం మద్యం దుకాణాల్లో నగదు తీసుకుని మాత్రమే సరకు అమ్ముతున్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులూ స్వీకరించనున్నారు.

మరో ఏడాది ఇదే తరహాలో అమ్మకాలు
అమ్మకాల్లో పారదర్శకత కోసం, అక్రమాల నిరోధానికే డిజిటల్ చెల్లింపుల విధానం తెచ్చినట్లు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. మద్యం విక్రయాల ద్వారా గత ఏడాది 18 వేల కోట్ల రూపాయాలకు పైగా ఆదాయం రాగా.. ఈ సారి అది 20 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తవుతున్న సమయంలో మరో ఏడాది వరకు ఇవే షాపులను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Recommended Video

మద్య నిషేధం హామీ అమలు ఎలా
ప్రస్తుతం ఆర్దిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, మరి హామీ ఇచ్చిన విధంగా దశల వారీ మద్యపాన నిషేధం రాష్ట్రంలో అమలు సాధ్యమేనా..చివరగా ఒక్క సారిగా దుకాణాలను ఎత్తి వేయటం అలమయ్యే పనేనా అనే చర్చలు మొదలయ్యాయి. దీంతో..ఇప్పుడు ప్రభుత్వ నూతన మద్యం పాలసీ పైన రాజకీయంగానూ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications