పెళ్ళయిన కొద్దిసేపటికే వరుడు మృతి.. వధువుకు షాక్.. ఏపీలోని నంద్యాలలో విషాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, కనీసం భార్యతో మనసారా మాట్లాడక ముందే, కాళ్ల పారాణి ఆరకముందే వరుడు మృతి చెందిన ఘటన, వధూవరుల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.
పెళ్ళయి 15రోజులైనా కాకముందే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి; విషాదంలో వధువు!!

పెళ్ళైన గంటల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదం .. వరుడు మృతి
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం పరిధిలో చోటుచేసుకున్న విషాద ఘటన వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి వివాహం చేసుకున్న వరుడు శివకుమార్, శనివారం తెల్లవారుజామున రోడ్డుపై వెళుతుండగా వెలుగోడు మండలంలోని మోత్కూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ మరణ వార్త విన్న వధువు షాక్ కు గురైంది.

వరుడి మృతితో విషాదంలో వధూవరుల కుటుంబాలు
పెళ్లి జరిగిన ఇంట్లో చావుకబురు తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన కొద్ది గంటలలోనే వరుడు శివకుమార్ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

శ్రీకాకుళం జిల్లాలోనూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి
ఇక ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన విషాదంగా మారింది. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం పెద్ద కొల్లివసన ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పవన్ కుమార్ ఓ యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి జూన్ 17వ తేదీన సింహాచలంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం పవన్ కుమార్ బైక్ పై తన మేనమామ బలగ సోమేశ్వరరావు తో కలిసి స్వగ్రామానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్ అక్కడికక్కడే మరణించగా, మేనమామ సోమేశ్వర రావు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పెళ్లి సంతోషం నిండాల్సిన ఇళ్ళలో విషాదం నింపుతున్న ఘటనలు
ఇటీవల కాలంలో పెళ్లి సంతోషాన్ని నింపాల్సిన అనేక కుటుంబాలలో, చోటుచేసుకుంటున్న అనేక విషాద ఘటనలు కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. కలకాలం కలిసి ఉంటామని ఏడు అడుగులు వేసి, జీవితాన్ని ప్రారంభించబోయిన అనేక కొత్త జంట ఆశలు ఆదిలోనే అడియాశలు అవుతున్నాయి. ఊహించని కారణాలతో జీవిత భాగస్వాములు విగతజీవులుగా మారుతుంటే విధి ఆడిన వింత ఆటలో ఆయా కుటుంబాలలోని మిగిలిన వారంతా పావులుగా మారుతున్నారు.