తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా..!!
ప్రఖ్యాత పుణక్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. బుధవారం నాడు 63,887 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,561 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.79 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఈ- డిప్ ద్వారా ఎంపిక చేశారు.

ఈ పరిస్థితుల మధ్య శ్రీవారి సేవకుల సేవలను మరింత విస్తృతం చేయనుంది టీటీడీ. ఈ క్రమంలో తిరుమలలోని సేవా సదన్ లో శ్రీవారి సేవా గ్రూప్ సూపర్ వైజర్ల కోసం ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఈ కార్యక్రమాన్ని సందర్శించారు. శిక్షణా కార్యక్రమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు.
శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. 2000 సంవత్సరం నవంబర్ లో 200 మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవ ప్రస్తుతం 17 లక్షల మందికి చేరుకుకుందని, ఇది చాలా గొప్ప విషయంగా ప్రశంసించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్ వైజర్లకు ట్రైన్ ద ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తరగతి శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం చేసిన అంశాలను గ్రూప్ సూపర్ వైజర్లకు తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు నేర్పించి వారిని ఉత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. త్వరలో టీటీడీ పరిధిలోని స్థానికాలయాలన్నింటిలో కూడా శ్రీవారి సేవను దశల వారీగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. శ్రీవారి సేవకులు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా శ్రీవారి సేవ చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications