కార్పొరేషన్ కౌన్సిల్ లో తన్నుకున్న వైసీపీ, టీడీపీ?
గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వేసవిలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మేయర్ ను నిలదీశారు. అయితే ఈ విషయంలోనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాలకు చెందినవారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఘర్షణ పడ్డారు.
ఘర్షణలో వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రపైకి దూసుకువెళ్లారు. గుంటూరు పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫాతోపాటు గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఇరువైపులా సర్దిచెప్పడంతోపాటు తన్నుకోబోయిన ఇరువర్గాలను శాంతపరిచారు. టీడీపీ కార్పొరేటర్లు వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని, వారిచేత క్షమాపణలు చెప్పించాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు.

కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా సాగింది. తాము ప్రతిపాదించిన అంశాలపై మాట్లాడకుండా కూర్చొని వినాలని ఎదురుదాడికి దిగారంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. వార్డు కార్పొరేటర్లు ఒకరిపై మరొకరు దూసుకురావడంతో ఎమ్మెల్యేలతోపాటు మార్షల్స్ కూడా ఇరువర్గాలను విడదీశారు. టీడీపీ కార్పొరేటర్లు పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మేయర్ గొడవను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఇరువర్గాలవారు వినకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
ఇరుపార్టీలకు చెందిన కార్పొరేటర్లు సభలోనే వాగ్వాదానికి దిగడం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులే ఇలా వ్యవహరిస్తుంటే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని, పార్టీల పేరుతో కొట్టుకోకుండా నగరంలో అభివృద్ధి పనులు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications