టర్కీకి షేక్ హ్యాండ్ ఇచ్చి భారత్, ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్..!
అమెరికా మరోసారి అంతర్జాతీయంగా తన పెద్దన్న పాత్రను గుర్తు చేస్తూ తీసుకున్న ఓ నిర్ణయం పాకిస్తాన్ మిత్రదేశం టర్కీకి సంతోషం కలిగించగా.. వీరికి శత్రువులైన భారత్, ఇజ్రాయెల్ కు మాత్రం షాకిచ్చింది. ప్రపంచ దేశాలకు ఆయుధాలు అమ్మడం ద్వారా వారిలో వారికే గొడవలు పెట్టే అమెరికా వాణిజ్య వ్యూహాల్లో భాగంగా టర్కీకి ఎస్-400 రక్షణ వ్యవస్థల కొనుగోలు విషయంలో గతంలో విధించిన ఆంక్షల్ని ట్రంప్ (Trump) తొలగించారు. అంతే కాదు ఎఫ్ -35 ఫైటర్ జెట్లను కూడా అమ్మేందుకు సిద్దమవుతున్నారు.
అంతర్జాతీయంగా ఇప్పుడు ఆయుధాల కంటే ఆయుధాల నుంచి రక్షించుకునే, తిప్పికొట్టే వ్యవస్థలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ఎస్-400 ఆయుధ వ్యవస్థల్ని టర్కీ కొనుగోలు చేయకుండా అమెరికా ఎప్పటి నుంచో ఆంక్షలు విధించింది. అయితే వీటిని తాజాగా ట్రంప్ ఎత్తేశారు. అలాగే టర్కీకి అమెరికా ఎఫ్-35 యుద్ద విమానాలను కూడా విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సహజంగానే ఈ వ్యవహారం టర్కీ ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

అదే సమయంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు డ్రోన్లు ఇచ్చి మన దేశంపై దాడులకు సాయం చేసిన టర్కీకి ఇప్పుడు అమెరికా ఎఫ్ 35 పైటర్ జెట్లు అమ్మాలని భావిస్తుండటం కేంద్రానికి సంకటంగా మారబోతోంది. ఎందుకంటే
లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్-35 లైట్నింగ్ 2 ఓ అధునాతన ఒకే సీటు, ఒకే ఇంజిన్ కలిగిన సూపర్‌సోనిక్ స్టెల్త్ ఫైటర్. దీనిని గగనతలంలో ప్రత్యర్ధులపై ఆధిపత్యం చెలాయించడానికి, అలాగే కచ్చితమైన దాడుల్ని చేసేందుకు తయారు చేశారు. దీన్ని అమెరికా వ్యూహాత్మకంగా మాత్రమే తన మిత్రదేశాలకు అమ్ముతుంటుంది. ఇప్పుడు టర్కీకి అమెరికా వీటిని అమ్మితే, అక్కడి నుంచి పాకిస్తాన్ కు చేరితే రేపు భారత్ కు ప్రమాదం తప్పదు. అందుకే భారత్ కూడా ఈ డీల్ ను నిశితంగా గమనిస్తోంది.














Click it and Unblock the Notifications