పవన్‘జేఎఫ్‌సీ’పై నమ్మకం లేదు, క్షమాపణ చెప్పండి: టీడీపీకి జీవీఎల్ వార్నింగ్
న్యూఢిల్లీ/అమరావతి: ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
Recommended Video

అబద్ధాలు ప్రచారం చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని వేడుకుంటున్నానని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాను రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు చూస్తున్నారని అన్నారు.

పవన్ జేఎఫ్‌సీపై నమ్మకం లేదు
ఇక పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ(జేఎఫ్‌సీ)పై తమకు నమ్మకం లేదని జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

అధికార టీడీపీకి వార్నింగ్
ప్రత్యేక హోదా అంటే అదేమీ సంజీవని కాదని, రాజకీయ పార్టీల నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని జీవీఎల్ హితవు పలికారు. ప్రజలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలే గానీ, రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. బీజేపీ నిజాలు చెప్పడం మొదలు పెడితే.. అధికార పక్షానికి ఇబ్బందులు తప్పవని జీవీఎల్ నర్సింహారావు హెచ్చరించారు.

గొంతుకోసిన కాంగ్రెస్.. టీడీపీ అలా
కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి కానీ, బురద జల్లడం, తిట్టుకోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ గొంతుకోసిందని జీవీఎల్ ఆరోపించారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణలకు ఎందుకు పెట్టుబడులు సమానంగా తీసుకురాలేదని ప్రశ్నించారు.

ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పండి..
అప్పుడే ఈ రెండు పార్టీలు ఏపీ ప్రజల సొమ్మును హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉండాల్సిందని అన్నారు. ఇందుకు ఏపీ ప్రజలకు రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు.












Click it and Unblock the Notifications