H1B Visa ఫీజు వ్యవహారం: మనోళ్ల టాలెంట్ ఏంటో వాళ్లకు తెలుసు
H-1B వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క H1B visa మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల విసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిణమించాయి. ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు టెక్ ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి.
ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.హెచ్ 1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం పడే ప్రభావం తాత్కాలికమేనని, అమెరికాకు భారతీయ టెక్ నిపుణులు తక్కువ ఖర్చుతో సర్వీసులు అందిస్తారని, అవే వారికి తిరిగి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన సేవలను కలగలిపిన భారతీయ టెక్ నిపుణులకు అన్ని ప్రాంతాలలోనూ డిమాండ్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ టెక్ నిపుణులు అతి తక్కువ ఖర్చుతో అమెరికాకు తమ సర్వీసులను అందిస్తోన్నారని, ఇది చాలా ముఖ్యమైన విషయమని చంద్రబాబు అన్నారు. ఖర్చును దృష్టిలో పెట్టుకుని అమెరికా భారతీయులను తప్పకుండా ఆశ్రయిస్తారని, ఇది ఖచ్చితంగా జరుగి తీరుతుందని చెప్పారు. తనకు ఆ స్పష్టత ఉందని తేల్చి చెప్పారు. ఎలాంటి ఆంక్షలు విధించినా అవి భారతీయ టెక్ నిపుణుల పురోగతిని ఆపలేవని ధీమా వ్యక్తం చేశారు.
హెచ్ 1బీ విసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడం వల్ల కొంతమంది ఇబ్బంది పడతారని, ఇది తాత్కాలికమేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త వీసా నిబంధనల వల్ల ప్రభావితమైన టెకీలకు అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
స్వదేశీ 4జీ టెక్ స్టాక్ నుండి ఉపగ్రహాలు, డ్రోన్లు, AI క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు భారత్ అన్ని రంగాల్లో నెక్స్ట్ జెన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటోందని చెప్పారు. భారత్ ఎప్పటికీ అవకాశాలను సృష్టిస్తూనే ఉంటుందని అన్నారు. నైపుణ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనేక కంపెనీలు తమ నియామక వ్యూహాలను పునఃసమీక్షించుకుంటున్నాయని, ఈ మార్పు ఏపీ సహా దేశం నలుమూలల నుండి టెక్కీలకు సరికొత్త అవకాశాలను కల్పిస్తుందని చంద్రబాబు అంచనా వేశారు.












Click it and Unblock the Notifications