వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ డ్రామా, హైదరాబాద్ భూముల కోసమే: హరీష్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమైక్యం పేరిట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాటకాలాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దీక్షలతో పేరుతో ఆడుతున్న డ్రామాలను సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే కేంద్రం రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందని హరీశ్ రావు అన్నారు.

2009, జులైలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు.. తెలంగాణ ప్రజలెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరిన మాట వాస్తవం కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. 2012 మార్చిలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామని, అందుకే వారిపై పోటీ పెట్టబోమని జగన్ ప్రకటించారని తెలిపారు.

గతంలో వైయస్సార్ పార్టీలో ఉన్న కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్‌లు తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రకటించినప్పుడు కూడా జగన్ దాన్ని ఎందుకు ఖండించలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. 2012లో పరకాలలో పర్యటించిన విజయమ్మ, షర్మిలలు తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని, తెలంగాణపై ప్లీనరీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన మాట వాస్తవం కాదా ఆయన అని అన్నారు. తాము అధికారంలోకి వస్తే జగన్ తొలి సంతకం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఫైలుపైనే చేస్తారన్న కొండా మురళి, సురేఖలు వ్యాఖ్యలను అప్పుడు ఖండించకుండా ఇప్పుడు దీక్షలు చేయడమేంటని హరీశ్ అన్నారు.

2012లో మహబూబ్‌నగర్‌లో పర్యటించిన షర్మిల.. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదనీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి గానీ, జగన్ గానీ ఎప్పుడూ తెలంగాణను వ్యతిరేకించలేదని చెప్పిన మాట వాస్తవం కాదా అని అన్నారు. 2013 జులైలో తెలంగాణపై కేంద్రం ప్రకటన తర్వాత కూడా రాష్ట్రాన్ని విభజించినా తమకు అభ్యంతరం లేదని, ప్లీనరీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో తామే అధికారంలోకి వస్తామని ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు నాటకాలాడుతోందని అన్నారు. సీమాంధ్ర నేతల నాటకాలను ఎపిఎన్జీవోలు నమ్మొద్దని, విజ్ఞతతో వ్యవహరించాలని హరిశ్ రావు కోరారు.

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించి కేంద్రానికి 41మంది ఎమ్మెల్యేల బృందాన్ని పంపిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలంగాణకు తాము అనుకూలమని వైయస్ చెప్పాడని అన్నారు. తెలంగాణ రానప్పుడు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించిన జగన్, ఇప్పుడు సీమాంధ్ర ప్రజల ఓట్ల కోసం దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

YS Jagan

రాష్ట్రం విడిపోతుందన్న బాధ జగన్‌కు లేదని, రింగురోడ్డు చుట్టూ ఉన్న భూమలు పోతాయనే భయం, లోటస్ పాండ్ భవనం అంధకారమవుతుందని జగన్ బాధపడుతున్నారని అన్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత క్యాంపు ఆఫీసులో సిఎం పదవి కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు, చిరంజీవితో రాయబారాలు, కేంద్రంతో లాబీయింగ్ చేసిన జగన్ నీతి గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఇలాంటి జగన్ నీతి గురించి మాట్లాడుతున్నాడని తెలిస్తే అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హాజరేకు గుండెపోటు వచ్చే అవకాశముందని ఎద్దేవా చేశారు.

సీమాంధ్ర ప్రజలపై కన్నా వారి ఓట్ల పైనే జగన్‌కు ప్రేమ ఎక్కువని హరీశ్ రావు అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ 2009లోనే నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు వస్తే పక్క రాష్ట్రం వచ్చినట్లుందని జగన్, పాకిస్థాన్‌కు వెళ్లినట్లుందని షర్మిల అంటోందని గుర్తు చేశారు. పక్క రాష్ట్రం కర్నాటకలోని బెంగళూరులో రాజభవనం కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటే అక్కడ జగన్‌ను ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు.

హైదరాబాద్ ను దోచుకునే అవకాశం, అక్రమ ఆస్తులు దక్కకుండా పోతాయని జగన్ బాధ పడుతున్నాడని అన్నారు. దీక్షలతో పేరుతో నాటకాలాడుతున్న జగన్ నిజస్వరూపాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని కోరారు. 60ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటం ఫలితం ఈ రాష్ట్రమని, గెలుపోటముల సమస్య కాదని అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి చేద్దామని సీమాంధ్ర ప్రజలకు సూచించారు. హైదరాబాద్‌లో నిజాయితీగా బతికే వారందూ ఉండొచ్చని అన్నారు.

అమెరికా, ముంబైలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్‌లో ఎందుకు చేసుకోలేరని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలకు అనుమాలొద్దని ఆయన అన్నారు. ఇబ్బందులు, సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. బంద్‌ల వల్ల సామాన్య ప్రజలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేటు విద్యా సంస్థలు, జగన్‌కు సంబంధించిన భారతి సిమెంట్స్, లగడపాటికి చెందిన ల్యాంకో విద్యుత్ ప్లాంటు, జెసి దివాకర్ బస్సులు ఏమైనా ఆగాయా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో నీతి పాలన చేస్తున్నట్లు ప్రకటించుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ లాగే అవినీతికి పాల్పడుతున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. మంత్రి వర్గం అనుమతి లేకుండా, బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా చిత్తూరు జిల్లాలో మంచినీటి సరఫరా కోసం 6వేల కోట్ల‌ను ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు.

English summary
Telangana Rashtra Samithi senior leader Harish Rao fired at YSR Congress Party president YS Jaganmohan Reddy on saturday in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X