విజయ్ తో ఖుష్బూ భేటీ- ఊహించినట్టే: ఎవరీ అవంతిక సుందర్?
ప్రముఖ తమిళ నటి ఖుష్బూ, ఆమె వెంట భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సీ తాజాగా ముఖ్యమంత్రి విజయ్ ఇంటి గుమ్మం తొక్కారు. ఈ ఉదయం విజయ్ నివాసంలో ఆయనను కలుసుకున్నారు. ఆ సమయంలో ఖుష్బూ దంపతుల వెంట వారి కుమార్తెలు అవంతిక, ఆనందిత, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాస్ ఉన్నారు. తన ఇంటికి వచ్చిన ఖుష్బూ, సుందర్ ను విజయ్ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
తమ కుమార్తె వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించారు. వెడ్డింగ్ కార్డును విజయ్ కు అందజేశారు. కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్‌ను పరిచయం చేశారు. ఈ విషయాన్ని ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విజయ్ తో కలిసిన ఫొటోలను ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. విజయ్ ను సోదరుడిగా అభివర్ణించారామె. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుమార్తె వివాహ మహోత్సవానికి విజయ్ ను ఆహ్వానించడం ఓ ప్రత్యేక, మరపురాని రోజుగా పేర్కొన్నారు.

విజయ్ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని ఈ సందర్భంగా ఖుష్బూ దంపతులు వ్యక్తపరిచారు. విజయ్ తో చిరకాల అనుబంధం ఉందని, ఆయనను కలిసిన ప్రతిసారీ తమ మనసులు గర్వంతో, ఆనందంతో నిండిపోతాయని ఖుష్బూ పేర్కొన్నారు. తమతో పాటు పిల్లలు కూడా రావడంతో విజయ్ ఎంతో సంతోషించారని, తన కుమార్తెలు, ఆయనపై నుంచి చూపు తిప్పుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా ఎంతో బిజీ షెడ్యూల్, అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ, తమను ఎప్పటిలాగే ఆప్యాయతతో, చిరునవ్వుతో స్వాగతించారని ఖుష్బూ సంతోషం వ్యక్తం చేశారు. తమ పట్ల ఆయన చూపిన ఆత్మీయత, విలువైన సమయాన్ని కేటాయించారని, కుమార్తెలకు ఆశీస్సులు అందించారని, ఈ ప్రత్యేకమైన సందర్భం మాటల్లో చెప్పలేనంత గొప్పదని ఆమె పేర్కొన్నారు. ఇదివరకే ఖుష్బూ కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందజేసింది.
అవంతిక సుందర్.. ఖుష్బూ దంపతుల పెద్ద కుమార్తె. వారి చిత్ర నిర్మాణ సంస్థ అవని సినిమాక్స్ పేరు మీదే ఈ పేర్లు పెట్టారు. అవంతిక సుందర్ 'ఆరంభం' అనే మలయాళీ చిత్రంతో వెండితెరకు పరిచయం కానున్నారు. ఆరతి అనే క్యారెక్టర్ ను పోషిస్తోన్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్. దీనికి సుజేశ్ అన్నీ ఈపెన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు కూడా ఇదే మొదటి సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.
'ఆరంభం' చిత్రం పూజా కార్యక్రమం త్రిశూర్‌లోని చావక్కాడ్‌లో జరిగింది. కున్నంకుళం, చావక్కాడ్, కొల్లంకోడ్ సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. ఈ సినిమాను స్టూడియో బెల్లారూక్ నిర్మిస్తోంది. ప్రముఖ నటి సుచిత్ర మోహన్‌లాల్ ఈ సినిమా సెట్స్‌ను సందర్శించడం హాట్ టాపిక్ అయింది. సుమారు 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తమిళ నటి సరిత మలయాళ చిత్రసీమలోకి తిరిగి అడుగుపెట్టారు.. ఆరంభం ద్వారా.












Click it and Unblock the Notifications