విషం కక్కే బాబుతో చేతులెలా కలిపారు: జానాపై హరీశ్
హైదరాబాద్: జడ్పి ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జుగుప్సాకరమైన పొత్తులకు తెరలేపాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆయన శనివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై విషం చిమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు.
పదవుల కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు ఎందుకు కలపాల్సి వచ్చిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పిపిఏల రద్దు పేరిట తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏకపక్షంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను గెలుచుకుందని హరీశ్ రావు అన్నారు. బంగారు తెలంగాణ కోసమే పలువురు నాయకులు తమ పార్టీలోకి వచ్చారని తెలిపారు.
కాగా, తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల జడ్పి ఛైర్మన్ పదవులను టిఆర్ఎస్ దక్కించుకోగా.. నల్గొండ జడ్పి ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది. కోరం లేని కారణంగా రంగారెడ్డి జడ్పి ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. హైకోర్టు స్టే విధించడంతో ఖమ్మం జడ్పి ఛైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications