బాబును అనరేం, బెదరం: కిషన్‌పై హరీష్, పొన్నాలవల్లే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణమాఫీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రుణమాఫీ చేయడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను కిషన్ రెడ్డి అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. రుణమాఫీ పైన బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికారు. హామీల పైన మాట నిలబెట్టుకున్న కేసీఆర్‌ను విమర్శించడం తగదన్నారు. పొన్నాలకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన పొన్నాల వంటి వారి వల్లనే ఇప్పుడు తెలంగాణకు ఇబ్బందులు అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు తమ ప్రభుత్వం బెదరదన్నారు.
పొన్నాలపై జీవ్ రెడ్డి విసుర్లు
టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పైన సొంత పార్టీ కాంగ్రెసుకు చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఓటమికి బాధ్యత వహిస్తానని చెప్పిన వారు, ఆ బాధ్యత ఏమిటో చెప్పాలన్నారు. బాధ్యత తీసుకోక పోవడం వల్లనే పార్టీ ఇలా ఉందన్నారు. మెదక్ ఉప ఎన్నిక ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని పొన్నాల ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications