మీరొకటి చేస్తే.. మేం చాలా: బాబుకు హరీష్ హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్రం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నిప్పులు చెరిగారు. పిపిఏల రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయం హాస్యాస్పదమని, మీరు ఒకటి చేస్తే తాము చాలా చేస్తామని హరీష్ రావు... నారా చంద్రబాబు నాయుడు ఎపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హైదరాబాదులో ఉన్న మీ అసెంబ్లీకి, మీ ఇళ్లకు కరెంట్ అవసరం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాదులో ఉండే మీ ప్రభుత్వాలు విద్యుత్ లేకుండా నడుస్తాయా చెప్పాలన్నారు. పిపిఏల రద్దుతో 600 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ రాసిన లేఖను చంద్రబాబు ఉపసంహరించుకోవాలన్నారు.

పిపిఏలు రద్దు చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం హాస్యాస్పదమే అన్నారు. ఏపి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ఈ విషయమై కెసిఆర్ సమీక్ష చేస్తారని, ఎపి సర్కారు నిర్ణయాన్ని తాము అమలు కానివ్వమని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
తెలుగు ప్రజల సెంటిమెంటు పేరు చెప్పే మీరు ఇలా ఎలా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలన్నారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిలో మీరు ఉంటారని, అప్పుడు మీకు విద్యుత్ అవసరం లేదా అని ప్రశ్నించారు. మా రైతులకు, పారిశ్రామికవేత్తలకు ఎలా విద్యుత్ ఇవ్వాలో తమకు తెలుసునని చెప్పారు. తాము స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్టులో ఉన్నదే అడుగుతున్నామన్నారు.
కాగా, పిపిఏ రద్దుపై ఎపి ప్రభుత్వం నిర్ణయం సరికాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వేరుగా అన్నారు. విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు సామరస్యంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి కూడా దీనిపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications