రాజ్యసభ రేసులో ఉండవల్లి: కిరణ్‌కి హర్ష, ఢిల్లీపై ఆగ్రహం
హైదరాబాద్: సమైక్యానికి మద్దతుగా రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగాలని అమలాపురం ఎంపి హర్ష కుమార్ శనివారం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వారిలో తనతో పాటు ఆయన కూడా ఉన్నారని, ఉండవల్లి మంచి అభ్యర్థి అవుతారన్నారు.
కెవిపి రామచంద్ర రావుకు మరోసారి టిక్కెట్ ఇస్తే తాను స్వాగతిస్తానని తెలిపారు. కెవిపి పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నికవుతారన్నారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు వచ్చినా తాము అవిశ్వాస తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం తొలుత అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ అంటే అధిష్టానానికి చిన్న చూపు అన్నారు.

సమైక్యాంధ్ర తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఉండవల్లిని నిలబెడతామని హర్షకుమార్ చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కోరినట్లు చెప్పారు. 42 ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీకి ఎందుకు చులకన భావమో అర్థం కావడం లేదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు రాజసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎమ్మెల్సీ చైతన్య రాజు చెప్పారు. తనకు కాంగ్రెస్ సభ్యత్వం లేదని, తాను ఐదేళ్లుగా కాంగ్రెస్‌కు సేవ చేశానని, తనకు 52 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డిలతో పాటు పలువురం సమావేశం అవుతున్నామని, 28న నామినేషన్ వేస్తానని, రెండు సీట్లయితే తాము తప్పక గెలుస్తామన్నారు.












Click it and Unblock the Notifications