పవన్ - జగన్ కలిసి కుట్రలు చేస్తున్నారు : టీడీపీని లేకుండా చేసే ప్రయత్నం : హర్షకుమార్ సంచలనం..!!
మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేసారు. కొద్ది రోజులుగా పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతున్న వివాదం పైన ఆయన స్పందించారు. కల్యాణ్ పర్యటనకు ఒప్పుకోమని చెప్పిన ప్రభుత్వమే హైప్ సృష్టిస్తోందని, జనసేన కార్యకర్తలకు ఆవేశం వచ్చిన తర్వాత ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందని హర్షకుమార్ ఆరోపించారు. నిజంగా పవన్‌కు చిత్తశుద్ది ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లు బాగుచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని హర్షకుమార్ విమర్శించారు.
పవన్ కళ్యాణ్ తనకు కుల ప్రాధాన్యత లేదని గతంలో చెప్పారని గుర్తు చేసారు. ఇప్పుడు ఆయనే కులాలను రెచ్చగొడుతున్నారంటూ విమర్శించారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందిన ఆరోపించారు. సీఎం జగన్...జనసేన అధినేత పవన్.. బీజేపీ కలిసి ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీ - కాంగ్రెస్ లకు పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయటమే సీఎం జగన్.. పవన్ కుట్ర అంటూ ఆరోపించారు.

రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ కాపు -బలిజ- ఒంటరి-తెలగా కులాలు పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. మీరు ముందుకు వస్తేనే శెట్టి బలిజలు..తూర్పు కాపులు..కలిసి వస్తారని..అదే విధంగా ఎస్సీలను కలుపుకొని రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కొంత తగ్గి ఉండాలని సూచించారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే, అధికార వైసీపీ..టీడీపీ మాత్రం ఈ వ్యాఖ్యల మీద స్పందించ లేదు. మార్పుకు ఉభయ గోదావరి జిల్లాలు కీలకమని పవన్ ఆ సభలో స్పష్టం చేసారు.
అదే రోజు తాము బద్వేలులో పోటీ చేయటం లేదంటూ..బీజేపీ వాదనకు భిన్నంగా పవన్ ప్రకటించారు. ఇక, బీజేపీ మాత్రం తాము బద్వేలులో పోటీ చేస్తామంటూ స్పష్టం చేసింది. పవన్ వ్యాఖ్యలతో రాజకీయంగా చర్చ సాగుతున్న సమయంలోనే ఇప్పుడు హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు కొత్త టర్న్ తీసుకున్నాయి. పవన్ - జగన్ ఇద్దరూ బీజేపీతో కలిసి టీడీపీని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ హర్షకుమార్ ఆరోపిస్తున్నారు. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications