సెంటిమెంట్లా ? కళాకారుల ఉపాధా ? చింతామణి నిషేధంపై హైకోర్టు సలహా..!
ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు దారి తీసింది. ఆర్యవైశ్యుల సెంటిమెంట్లు దెబ్బతింటున్నాయన్న కారణంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కళాకారుల ఉపాధిని దెబ్బతీస్తుందన్న చర్చ సాగుతోంది. ఇదే అంశంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి కీలక సలహా ఇచ్చింది.

చింతామణి నిషేధం
చింతామణి నాటకంలో ఆర్యవైశ్యుల వృత్తిని కించపరిచేలా ఉన్న సుబ్బిశెట్టి పాత్ర వివాదాస్పదంగా మారడంతో వైసీపీ సర్కార్ వైశ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నాటకాన్ని నిషేధిస్తూగతంలో ఉత్తర్వులు జారీ చేసింది. వైశ్యుల మనోభావాలు దెబ్బతింటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. కానీ ఈ నాటకం నిషేధంతో దీనిపైనే ఆధారపడ్డ కళాకారుల ఉపాధి దెబ్బతింటోంది. ఇదే అంశం ఇప్పుడు హైకోర్టులోనూ చర్చకు వచ్చింది. వైసీపీ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు.. మరోసారి వాదనలు విన్నది.

నిషేధంతో కళాకారులపై ప్రభావం
చింతామణిని నిషేధిస్తే కళాకారులపై ప్రభావం పడుతుందన్న వాదనపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఇందులో
హైకోర్టు చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దీనిపై ఆధారపడిన కళాకారుల ఉపాధిపై ప్రభావం పడుతున్న విషయాన్ని హైకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. ఇదే వాదనతో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు.. చింతామణి నాటకంపై ప్రభుత్వం విధించిన నిషేధం విషయంలో ప్రభుత్వానికి కీలక సూచన చేసింది.

జగన్ సర్కార్ కు హైకోర్టు సూచన
చింతామణి నాటకం ప్రదర్శన వల్ల వైశ్యుల మనోభావాలు దెబ్బతింటున్న కారణంగా నిషేధం విధించడం సబబే అయినా కళాకారుల ఉపాధి దెబ్బతింటున్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీంతో నాటకంలో అభ్యంతకరంగా ఉన్న అంశాల్ని తొలగించి మిగతా నాటకం ప్రదర్శనకు అనుమతి ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని హైకోర్టు సూచించింది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేసి పునఃపరిశీలన చేయాలని హైకోర్టు సూచించింది. దీనిపై ప్రభుత్వంతో చర్చించి అభిప్రాయం చెప్తామని సర్కార్ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.












Click it and Unblock the Notifications