Heart news: గుంటూరు-తిరుపతి గ్రీన్ ఛానల్
గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా ఓ మహిళ గుండెను సురక్షితంగా తరలించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు కోసం మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యింది.
అవయవదానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు రావడంతో గుంటూరు నుంచి గుండెను తిరుపతికి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి యాజమాన్యం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేసింది. వెంటనే గుండెను తరలించాల్సి ఉందని వివరించింది.

మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి.. గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి రేణిగుంటకు, అక్కడి నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో సురక్షితంగా గుండె ఆస్పత్రికి చేరడంతో వైద్యులు ట్రాన్సప్లాంటేషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా బ్రెయిన్ డెడ్ అయిన మహిళ భర్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్య ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. కళ్లు తిరిగి పడిపోవడంతో కాలు, చెయ్యి పని చేయలేదన్నారు. వెంటనే రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ, ఆమె కోమాలోకి వెళ్లారని, బ్రెయిడ్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు.
అవయవదానం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని సూచించడంతో తమ పిల్లలతో చర్చించి అవయవ దానానికి అంగీకరించినట్లు తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం, మంత్రి లోకేశ్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, గతంలో కూడా పలుమార్లు గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications