మరో 2 రోజులు తీవ్ర వడగాలులు..!
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉష్ణోగ్రత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. పార్వతీపురం మన్యం 44.87 డిగ్రీలు, విజయనగరం 44, అనకాపల్లి 43.9, అల్లూరి 42.7, తూర్పుగోదావరి 42.5, ఏలూరు 42.2, ఎన్టీఆర్ 41.9, విశాఖపట్నం 41.3, గుంటూరు 41, బాపట్ల 41, పల్నాడు 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. మరో రెండురోజులపాటు కోస్తా లో హీట్ వేవ్ కొనసాగనున్నట్లు తెలిపింది. ఆదివారం నుంచి రాయలసీమ జిల్లాల్లో వేడి పరిస్థితులు తగ్గుతాయని పేర్కొంది. ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటకలోని రత్నగిరి, కొప్పాల్ వరకు విస్తరించివున్నాయని వివరించింది.ఈనెల 18వ తేదీ నుంచి నైరుతి పవనాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయని, దీనివల్ల రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కుమురం భీం, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని, రానున్న 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. బిపర్ జాయ్ తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు శ్రీహరికోట వద్ద స్థిరంగా నిలిచివున్నాయి. బిపర్ జాయ్ తుపాను లేకపోతే ఏపీ అంతటా ఇప్పటికే వర్షాలు కురిసేవని, ఇప్పటికీ రుతుపవనాలు అలా స్థిరంగానే నిలిచివుండటంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications