ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణశాఖ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు వాతావరణం నిప్పుల కుంపటిలా మారుతోంది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వడగాడ్పుల హెచ్చరిక జారీచేసింది. రానున్న మూడు రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఏపీలో సోమవారం 36 మండలాల్లో, మంగళవారం 37 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 18 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. పగటివేళ అత్యవసర పని ఉంటేనే బయటకు రావాలని, అప్పుడు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మంచినీళ్ల సీసాలను తరుచుగా దగ్గరే ఉంచుకోవాలని, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలంటున్నారు.

కాటన్ దుస్తులు ధరించాలి. అలాగే దాహం వేయకపోయినా మంచినీరు ఎక్కువగా తాగుతుండాలి. ఏపీలోని విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప జిల్లాల్లో అత్యధి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అసాధారణ స్థాయిలో వేడి పెరగనుందని, వడగాడ్పుల దుష్ప్రభావాల నుంచి తప్పించుకునేందుకు వైద్యుల సలహాలు తీసుకోవాలని, ఈ ఏడాది కూడా 2019లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాల్సివస్తే కచ్చితంగా గొడుగులు తీసుకొని వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications