శ్రీవారి దర్శనానికి 40 గంటలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కొద్దిరోజులుగా శ్రీవారిని దర్శించుకుంటోన్న భక్తుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య ఉంటోండటమే దీనికి నిదర్శనం.
గురువారం నాడు 65,416 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 36,128 మంది తల నీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టింది.

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు సీతా తోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
ఈ నెల 18వ తేదీన 90,721 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 19న- 86,721, 20న- 85,825, 21న- 80,744, 22న- 80,048, 23న- 65,416 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తమ తలనీలాలను సమర్పించుకున్నారు. ఇదే తాకిడి మరో నెలరోజుల పాటు అంటే జూన్ 30వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది.
ప్రత్యేకించి- శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా ఉంటోంది. సెలవు రోజులు కావడం దీనికి ప్రధాన కారణం. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు సీతా తోరణం, ఏటీసీ సర్కిల్, నారాయణవనం వంటి ప్రాంతాల వరకూ క్యూలైన్‌లల్లో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది.
ఫలితంగా సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తుల దర్శనానికి తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. 30 నుంచి 40 గంటల పాటు సమయం పడుతోంది. వారాంతపు రోజుల్లో మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు లేకపోలేదు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.












Click it and Unblock the Notifications