హైదరాబాద్ టూ అమరావతి ఆషామాషీ కాదు: మోయలేని భారమే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించే ప్రక్రియ క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 2016 జూన్ 1లోగా రాష్టస్థ్రాయి ప్రభుత్వ కార్యాలయాలను కొత్త రాజధాని ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే కొత్త రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి భవనాలు లేవు. అందువల్ల తొలుత హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించాల్సి ఉంటుంది.
అమరావతిలో కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యాక మళ్లీ అక్కడికి మరోసారి తరలించాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్ నుండి విజయవాడకు ఒకసారి, విజయవాడ నుండి అమరావతికి మరోసారి తరలించాల్సి వస్తుంది. ఇది వ్యయప్రయాసలతో కూడిన పని. దానికితోడు విజయవాడలో అరకొరా అద్దె భవనాలు, వాటి నిర్వహణ కోసం ఏటా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో విజయవాడలో ఇళ్ల అద్దెలు కూడా పెరిగాయి. బెంగళూర్, హైదరాబాదులో లేనంత ఎక్కువ అద్దెలున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు. ప్రభుత్వోద్యోగులు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు.
అమరావతి నగరంలో భవనాల నిర్మాణానికి ఎటు లేదన్నా మూడు నాలుగేళ్లు పడుతుంది. రాష్ట్ర సచివాలయం, శాసనసభ భవనాలు, ఇతర రాష్ట్ర స్థాయికి చెందిన అత్యవసర భవనాలను రెండేళ్లలో పూర్తి చేసేందుకు వీలుంది. ఈ భవనాలకు నిధులు ఎలా సేకరిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. సాంకేతికంగా సింగపూర్, జపాన్ తదితర దేశాలకు చెందిన సంస్థలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి. సింగపూర్, జపాన్ సంస్థలు రియల్ ఎస్టేట్ వాటాల పద్ధతిలో భవనాలు నిర్మించే అవకాశం ఉందని, అందువల్ల ప్రభుత్వం ఎక్కువగా నిధులు పెట్టాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికా ఖర్చులకు నిధులు లేకపోవడంతో ప్రభుత్వం సమస్యను ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితిలో అమరావతిలో భవనాల నిర్మాణానికి నిధుల కొరత పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు లేకపోలేదు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో సచివాలయం, అసెంబ్లీ భవనం, సిసిఎల్‌ఎ, డిజిపి కార్యాలయం తదితర శాఖల భవనాలు ఆటంకాలేమీ లేకుండా సాగుతున్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఎపికి కేటాయించిన చాలా భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన ఫర్నీచర్, విద్యుత్తు పరికరాలు, ఇతర కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించేందుకు దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని అధికార వర్గాలు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఎపి రాజధాని కార్యాలయాలను కొంత కాలం పాటు హైదరాబాద్ నుండే నడిపించాలన్నది ప్రధాన డిమాండ్‌గా ఉంది. విభజన వల్ల ఏర్పడ్డ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి గట్టేక్కేందుకే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలు కూడా ‘కామన్ క్యాపిటల్'గా వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో స్పష్టం చేసింది. అంటే పదేళ్ల వరకు రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీతో పాటు ఇతర రాష్ట్ర కార్యాలయాలను హైదరాబాద్ నుండే నడిపేందుకు వీలుంది.
తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తిస్థాయి సహకారం లభిస్తోంది. రాష్ట్ర సచివాలయానికి ఐదు బహుళ అంతస్థుల భవనాలను కేటాయించారు. డిజిపి కార్యాలయానికి లక్డీకాపూల్‌లో ప్రత్యేక భవనం కేటాయించారు. సిసిఎల్‌ఎ కార్యాయానికి ప్రత్యేక భవనం కేటాయించారు. అలాగే ఇతర హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌కు కూడా అవసరమైన భవనాలు సమకూరాయి.
విజయవాడలో రాష్ట్ర సచివాలయం కోసం ఎంపిక చేసిన మేథాటవర్స్ ప్రస్తుతం సచివాలయంలోని ఒక భవనమంత విస్తీర్ణం కూడా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కార్యాలయాలకు విజయవాడలో భవనాలు దొరకడం అంత సులభంగా కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడకూడదని ఉద్యోగులంతా కోరుతున్నారు.












Click it and Unblock the Notifications